న్యాయవ్యవస్థలో అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

న్యాయవ్యవస్థలో అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

హైదరాబాద్ : దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆప్ జస్టిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం లేనప్పుడు.. అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తమ పార్టీ (బీఎస్పీ) తప్ప ఏ పార్టీ కూడా దీనిపై మాట్లాడడం లేదన్నారు. 

బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టం చేసింది.

2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా.. వీరిలో 1.3శాతం మంది ఎస్టీలు, 2.8శాతం మంది ఎస్సీలు, 11  శాతం మంది ఓబీసీలు, 2.6శాతం మైనార్టీలు ఉన్నారని డిపార్టుమెంట్ ఆప్ జస్టిస్ తెలియజేసింది.