రాష్ట్ర సాధనలో బహుజన విద్యావంతుల పాత్ర కీలకం

రాష్ట్ర సాధనలో బహుజన విద్యావంతుల పాత్ర కీలకం

హైదరాబాద్: బహుజన తెలంగాణను సాధించడంలో విద్యావంతులు క్రియాశీల పాత్ర పోషించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మేధోమధన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర సాధనలో విద్యావంతులు, మేధావుల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రజలను సమీకరించి... వారందరినీ ఉద్యమంలో నిలిపేందుకు బహుజన విద్యావంతులు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ గాలికొదిలారని ఫైర్ అయ్యారు. ఓ వైపు వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతోంటే... కేటీఆర్ కు ఓటీటీ సినిమాలు కావాల్సి వచ్చిందా అని మండిపడ్డారు. 

డిగ్నిటీ హౌజింగ్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్... ఇప్పటివరకు గుడిసెల్లో ఉంటున్న ఎంత మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశారని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడితే బహుజనుల బతుకులు రోడ్డు మీద పడతాయని హెచ్చరించారు. అందుకే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారన్న ఆయన... ఆ డబ్బునంతా తిరిగి కక్కిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ఉపాధిలేక లక్షల మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బహుజనులు అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.