ఫ్యాకల్టీ అవమానిస్తున్నారని ఇంజినీరింగ్స్టూడెంట్ సూసైడ్

ఫ్యాకల్టీ అవమానిస్తున్నారని ఇంజినీరింగ్స్టూడెంట్ సూసైడ్

గండిపేట,వెలుగు: ఫ్యాకల్టీ, తోటి విద్యా ర్థుల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, సూసైడ్ నోట్‌‌లోని వివరాల ప్రకారం.. పుప్పాలగూడకు చెందిన వి. శ్రేయ (20) వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 19 అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి, తన ఆత్మహత్యకు కళాశాలలో ఎదురైన వేధింపులే కారణమని పేర్కొంది.

జులై 17న నిర్వహించిన పరీక్ష సందర్భంగా ఓ అధ్యాపకుడు అందరి ముందు తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని, అనంతరం కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధించారని నోట్‌‌లో పేర్కొంది. మరో అధ్యాపకుడు ల్యాబ్ పరీక్షలో కాపీ కొట్టానని ఆరోపించారని, వాస్తవానికి పరీక్షలు వేర్వేరు సెషన్లలో జరిగినప్పటికీ తనపై  ఆరోపణలు చేశారని పేర్కొంది. పరీక్షలకు బాగా సిద్ధమైనప్పటికీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌‌లో రాసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.