మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ‘పురుగుల అన్నం ఎట్ల తినాలి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో డీసీవో కల్పన, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, రాయికోడ్ మండల ప్రత్యేక అధికారి జగదీష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి తదితరులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు.
అనంతరం బియ్యాన్ని తనిఖీ చేయగా పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే తరలించాలని తహసీల్దార్ రంగారావును ఆదేశించారు. భవిష్యత్‌లో నాణ్యత లేని సరుకులు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ప్రిన్సిపాల్‌పై చేసిన ఆరోపణలపైనా అధికారులు లెక్చరర్లతో మాట్లాడారు.
