బడ్జెట్ 2024: దోస్తులకు స్పెషల్ గిఫ్ట్ .. బాబు, నితీశ్​కు మోదీ ప్రాధాన్యం

బడ్జెట్ 2024: దోస్తులకు స్పెషల్ గిఫ్ట్ .. బాబు, నితీశ్​కు మోదీ ప్రాధాన్యం
  • ఏపీ రాజధాని అమరావతికి 15 వేల కోట్లు
  • పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ
  • బిహార్​కు 59 వేల కోట్లు కేటాయింపు
  • ఈసారి అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాలకే

న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్​లో ఏపీ, బిహార్ కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఎన్డీయే సర్కార్ లో కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పార్టీలు ఏపీ, బిహార్​లో అధికారంలో ఉండగా.. కేంద్రం బడ్జెట్​లో ఆ రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చింది. అటు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.. ఇటు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరినీ బుజ్జగించేందుకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. ఏపీకి రూ.15 వేల కోట్లు, బిహార్​కు రూ.59 వేల కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. 

బిహార్​కు బొనాంజా.. 

కేంద్రం ఈసారి బడ్జెట్​లో బిహార్​కు అత్యధిక నిధులు కేటాయించింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.59 వేల కోట్లు ప్రకటించింది. ఇందులో రోడ్ల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా పాట్నా–పూర్ణియా, బక్సర్–భాగల్​పూర్ ఎక్స్​ప్రెస్ వేలు, బక్సర్​లో గంగా నదిపై బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇక పవర్ ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.21,400 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా భాగల్​పూర్​లోని పీర్ పైంతిలో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో వరదల నియంత్రణకు చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11,500 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

 అదే విధంగా కొత్త ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు క్రీడా సౌలతుల అభివృద్ధికి సహకారం అందజేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ‘‘టెంపుల్ కారిడార్స్ డెవలప్ మెంట్ లో భాగంగా గయాలోని విష్ణుపాద ఆలయం, బోధ్ గయాలోని మహాబోధి టెంపుల్ ను టూరిస్టు ప్లేసుగా అభివృద్ధి చేస్తం. అలాగే చారిత్రక నగరం రాజ్ గిర్ ను, నలందను డెవలప్ చేస్తం” అని తెలిపారు.

ఏపీకి ఇండస్ట్రియల్ కారిడార్లు.. 

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఏపీ రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నాం. రానున్న సంవత్సరాల్లో మరిన్ని నిధులు అందజేస్తం. వివిధ డెవలప్ మెంట్ ఏజెన్సీల ద్వారా ఆర్థిక సాయం అందిస్తం” అని తెలిపారు.

 అలాగే పోలవరం ప్రాజెక్టుకూ ఆర్థిక సాయం అందజేస్తామని, దాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. దేశ ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘‘పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీలో ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కు సహకారం అందిస్తం. విశాఖపట్నం–చెన్నై, హైదరాబాద్–బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు ఇస్తం. ఈ కారిడార్లలో భాగంగా కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల్లో వాటర్, పవర్, రోడ్లు, రైల్వే సౌలతుల అభివృద్ధికి ఫండ్స్ కేటాయిస్తం” అని వెల్లడించారు. అలాగే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్స్ విడుదల చేస్తామని ప్రకటించారు.