- ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన బతుకమ్మ కుంట
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల సంక్రాంతి నాటికి నగరంలో సుందరీకరించిన మరో రెండు చెరువులను హైడ్రా అందుబాటులోకి తీసుకురానున్నది. మొదటి దశలో రూ.58.50 కోట్లతో బతుకమ్మ కుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట, గుట్టల బేగంపేట్ సున్నం చెరువు, శివరాంపల్లి బుమృక్నుద్దౌలా చెరువుల పునర్నిర్మాణ పనులను హైడ్రా చేపట్టింది. వీటిలో బతుకమ్మ కుంట పనులు పూర్తి కావడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మిగిలిన వాటిలో బుమృక్నుద్దౌలా చెరువు పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కూకట్‌పల్లి నల్లచెరువు, మాదాపూర్‌లోని తమ్మిడి కుంట చెరువుల పనులు చివరిదశలో ఉన్నాయి. దీంతో బుమృక్నుద్దౌలా, కూకట్ పల్లి నల్ల చెరువులను సంక్రాంతికి సీఎంతో ప్రారంభింపజేయాలని హైడ్రా భావిస్తోంది.
రాణులు స్నానాలు చేసిన చెరువు..
1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్దౌలా... బుమృక్నుద్దౌలా చెరువును నిర్మించినట్లు తెలుస్తున్నది. వంద ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేదని, రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చరిత్రకారులు చెప్తున్నారు. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బుమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు.
బుమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి, ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారంటున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని నిజాం రాజులు మాత్రమే వినియోగించేవారు. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని చెబుతున్నారు. ఈ నీటిని అరబ్ దేశాలకు కూడా తీసుకువెళ్లేవారంటున్నారు.
16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు నల్లచెరువు..
ఆక్రమణలతో కూకట్‌పల్లి నల్ల చెరువు 16 ఎకరాల్లో మాత్రమే మిగలగా, రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారం సేకరించిన హైడ్రా 30 ఎకరాలకు విస్తరించింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన16 కమర్షియల్షెడ్లను తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలను, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగింది. చెరువు వద్ద బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు.
బతుకమ్మలను వేయడానికి ప్రత్యేకంగా చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు. చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్‌వే నిర్మించారు. దీన్ని రోజూ 600 మంది ఉపయోగిస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్‌లా మారతాయని అధికారులు అంటున్నారు. చెరువులో ఐల్యాండ్స్ నిర్మించామని, బోటింగ్ సౌకర్యం, కమ్యూనిటీ హాల్స్ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దవాళ్లు సేదతీరేలా గజబో(విశ్రాంతి మందిరం)లు నిర్మిస్తున్నారు. చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటుతున్నారు.
