సీకేఎం హాస్పిటల్‌‌లో ఎలుకల ఘటనపై.. హెచ్‌‌ఆర్‌‌సీలో కేసు నమోదు

సీకేఎం హాస్పిటల్‌‌లో ఎలుకల ఘటనపై.. హెచ్‌‌ఆర్‌‌సీలో కేసు నమోదు
  • ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌‌ రామారావు  

పద్మారావునగర్‌‌, వెలుగు : వరంగల్‌‌లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌‌లో ఎలుకలు తిరుగుతున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌ సీరియస్‌‌ అయింది. ఇంక్యుబేటర్‌‌ వార్డు సహా ప్రసూతి, పిల్లల వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌ కావడంతో.. హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హెచ్‌‌ఆర్‌‌సీలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. 

ఎలుకల కారణంగా నవజాత శిశువులు, తల్లులు గాయపడుతున్నారని, హాస్పిటల్‌‌ భద్రత, -పరిశుభ్రతపై సందేహాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తుతో సమగ్ర విచారణ చేపట్టాలని, హౌస్‌‌ కీపింగ్‌‌, శానిటేషన్‌‌, భద్రత, ప్రైవేట్‌‌ ఏజెన్సీ పనులను తనిఖీ చేయడంతో పాటు బాధితులకు తక్షణ వైద్యసేవలు, పరిహారం చెల్లించేలా చూడాలని కమిషన్‌‌ను  కోరారు.