హ్యాంగ్జౌ: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–- చిరాగ్ షెట్టి తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన మెన్స్ డబుల్స్ గ్రూప్–-బి రెండో మ్యాచ్‌లో సాత్విక్–-చిరాగ్ 21–-11, 16-–21, 21–-11 తేడాతో 8వ ర్యాంకర్ ఫజర్ అల్ఫియాన్– ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా)పై విజయం సాధించారు.
గంటపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇండియా జోడీ అదరగొట్టింది. నెట్ గేమ్‌లో మెరుగైన ఇండోనేసియా షట్లర్లను అడ్డుకోవడానికి సాత్విక్–-చిరాగ్ తమ దూకుడును తగ్గిస్తూ, వ్యూహాత్మకమైన షాట్లతో అలరించారు. తొలి గేమ్‌లో 6–-0తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న ఇండియన్స్ బ్రేక్ టైమ్‌కు 11–-2తో భారీ ఆధిక్యంలో నిలిచారు. చిరాగ్ పదునైన క్రాస్-కోర్ట్ షాట్లు కొట్టగా.. సాత్విక్ అద్భుతమైన డిఫెన్స్‌తో తొలి గేమ్‌ను సులభంగా గెలుచుకున్నారు. వెంటనే పుంజుకున్న ఇండోనేసియా జంట రెండో గేమ్ నెగ్గి పోటీలో నిలిచింది. కానీ, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్–-చిరాగ్ మళ్లీ విశ్వరూపం చూపెట్టారు. స్టార్టింగ్ నుంచే వరుస పాయింట్లతో 11–-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ఇండియా షట్లర్లు ప్రత్యర్థుల తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్‌ను ఈజీగా సొంతం చేసుకున్నారు. వరుసగా రెండు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న సాత్విక్–చిరాగ్ శుక్రవారం జరిగే గ్రూప్ మ్యాచ్‌లో మలేసియా ద్వయం, రెండో సీడ్స్ ఆరోన్ చియా–- సో వూయ్ యిక్‌తో తలపడతారు.
