మహబూబాబాద్, వెలుగు : వందే భారత్ మెగా మెయింటెనెన్స్ పీరియాడికల్ ఓవరాలింగ్ ప్రాజెక్ట్ (మెగా రైల్వే ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో) మహబూబాబాద్ ప్రాంతంలోనే ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహబూబాబాద్ పట్టణ కేంద్రం సమీపంలో 409.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ – మహబూబాబాద్ ప్రాంతాల మధ్యన ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించగా.. ఇందుకోసం రూ. 908.15 కోట్లను సైతం మంజూరు చేసింది.
అయితే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నష్కల్ సమీపంలో ఈ పీవోహెచ్ ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరడంతో.. ప్రాజెక్ట్ మహబూబాబాద్ నుంచి తరలిపోతోందని ప్రచారం జరిగింది. దీంతో ప్రజా, విద్యార్థి సంఘాలు, సీపీఎం, సీపీఐ, బీఆర్‌ఎస్ లీడర్లు పోరాటాలకు దిగడంతో అప్రమత్తమైన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భుక్యా మురళీనాయక్ హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి పీవోహెచ్ ఏర్పాటుకు మహబూబాబాద్‌లో ఉన్న అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ భూముల లభ్యత వివరాలను అందజేశారు.
దీంతో స్పందించిన ప్రభుత్వం మహబూబాబాద్ ప్రాంతంలో పీవోహెచ్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు భూమిని కేటాయించింది. ఈ మేరకు మహబూబాబాద్ సమీపంలోని అనంతారం రైల్వే ట్రాక్ సమీపంలో మొత్తం 409.01 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.
