- నితిన్ గడ్కరీతో ప్రియాంకా గాంధీ భేటీలో సరదా సంభాషణ
న్యూఢిల్లీ: కేరళలో హైవే ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భేటీ అయ్యారు. గురువారం పార్లమెంట్‌లోని గడ్కరీ చాంబర్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో సీరియస్ చర్చలతోపాటు, సరదా ముచ్చట్లు, ఓ వంటకం హైలైట్ అయ్యాయి. ఈ సందర్భంగా కేరళలోని ఆరు హైవే ప్రాజెక్టులను చేపట్టాలని ప్రియాంక కోరారు.
దీనికి ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా రాయ్‌బరేలీలో రోడ్ల పనుల గురించి తనను కలిసినట్లు గుర్తుచేశారు. ‘‘ఇప్పుడు మీ పనులు చేయకపోతే.. మా అన్నయ్య అడిగితే చేశారుగానీ, నా పనులు ఎందుకు చేయరని ఫిర్యాదు చేస్తారు కదా’’ అని గడ్కరీ అనడంతో ప్రియాంకతోపాటు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
అయితే, రాజకీయ చర్చల మధ్యే తనను కలవడానికి వచ్చిన ఎంపీలందరికీ గడ్కరీ.. తాను యూట్యూబ్‌లో చూసి చేసిన రైస్ బాల్ వంటకాన్ని సర్వ్ చేశారు. ప్రియాంకతోపాటు వచ్చిన కాంగ్రెస్ నేత దీపీందర్ సింగ్ హుడా కూడా ఆ వంటకాన్ని రుచి చూశారు. అయితే, ప్రియాంక కోరిన కేరళ హైవేస్ ప్రాజెక్టుల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, మిగతావాటిని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
