- పంచాయతీల ఫలితాలే ఇందుకు నిదర్శనం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజలకు నమ్మకం పోయిందని.. రెండేండ్ల పాలనతో విసిగిపోయిన జనం కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దీనికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ హవా నడిచిందని, అత్యధికంగా 213 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని వెల్లడించారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. పార్టీ సింబల్ లేని ఎన్నికల్లో గెలిచినోళ్లందరినీ తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ లీడర్లకు తగదన్నారు.
రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడే ప్రజల్లో ఎవరికి ఎంత బలం ఉందో తేలిపోతుందన్నారు. కాగా, శుక్రవారం నిర్మల్లో గెలిచిన సర్పంచులను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు చేతుల మీదుగా సన్మానించనున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో కమలం పార్టీ సత్తా చాటిందని ఏలేటి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోనే 128 గ్రామాలకు గాను 80 చోట్ల బీజేపీ మద్దతుదారులే గెలిచారని చెప్పారు. కాగా, నిర్మల్ జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలిపించి పార్టీ సత్తా చాటినందుకు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ జాతీయ నేత, కర్నాటక-తమిళనాడు ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ ఆఫీసులో శాలువాతో సన్మానించి అభినందించారు.
