జనగామ అర్బన్, వెలుగు: ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పూర్తి చేసిన కృషి సఖీలకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవాన్ని గురువారం కలెక్టరేట్ లో సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరై వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల నుంచి 30 మంది సభ్యులను ఎంపిక చేసి, మారీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఐదు రోజులపాటు శిక్షణ అందించారు.
జిల్లాలో మొదటి విడతగా 1875 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారన్నారు. అనంతరం రైతులకు యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటినుంచే యూరియా బుకింగ్ చేయడం ద్వారా రైతులకు యూరియా సాఫీగా సమర్ధవంతంగా అందుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఏవో అంబికా సోని, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవి తంగ, శరత్ చంద్ర, డీఆర్డీవో వసంత, నిరుద్దీన్, డీపీఎం నలిని, వెంకస్వామి, ప్రమోద్, రాజేందర్ గౌడ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
