- వరుస ఆర్డర్లు ఇచ్చేస్తున్నరు.. ఈ ట్రెండ్ మంచిది కాదు
- ఇది న్యాయవ్యవస్థలో అవినీతికి కారణమవుతున్నది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ దగ్గరపడ్తున్న కొద్దీ కొందరు జడ్జీలు వరుస ఆర్డర్లతో సిక్స్లు కొట్టాలని చూస్తున్నారని, ఇది న్యాయవ్యవస్థకు ప్రమాదకరమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతి మంచిది కాదని హితవు పలికింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జి తన రిటైర్మెంట్కు ముందు వరుసగా పలు ఆర్డర్లు జారీ చేశారు. ఇవి తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
దీంతో రిటైర్మెంట్కు పదిరోజుల ముందు ఆయనను సస్పెండ్ చేస్తూ అక్కడి హైకోర్టు ఫుల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో సదరు జడ్జి పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘‘పదవీ విరమణ సమయం దగ్గరపడ్తున్న టైమ్‌లో కొందరు జడ్జీల తీరు వింతగా ఉంటున్నది.
వరుసగా ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. రిటైర్మెంట్కు ముందు ఏదో ఆశించి సిక్స్లు కొట్టాలనే ఇలాంటి ట్రెండ్ న్యాయవ్యవస్థలో ఎక్కువవుతున్నది. ఇది అవినీతికి దారితీస్తున్నది. పిటిషనర్ (మధ్యప్రదేశ్ జిల్లా జడ్జి) సరిగ్గా పదవీ విరమణకు ముందు సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇదొక దురదృష్టకరమైన ధోరణి. దీని గురించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు” అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి ధోరణి న్యాయవ్యవస్థలోనూ అవినీతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా జడ్జి నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అంతకు కొన్నిరోజుల ముందు వరుసగా పలు ఆర్డర్లు జారీ చేశారు. ఇవి వివాదాస్పదమవడంతో నవంబర్ 19న ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. నవంబర్ 20న సుప్రీంకోర్టు.. సదరు జడ్జి రిటైర్మెంట్ను మరో సంవత్సరం పొడిగించింది.
‘‘రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పొడిగించినట్లు సదరు జడ్జికి ఆ వరుస ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తెలియదు. అందుకే ఆయన సిక్స్లు కొట్టాలని చూశారు. ఇలాంటి ట్రెండ్ దురదృష్టకరం” అని విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సదరు జడ్జిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్కడే తేల్చుకోవాలని చెప్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల్లో దీనిపై తేల్చాలని హైకోర్టును ఆదేశించింది.
హైకోర్టు మాజీ జడ్జిలు డివిజన్ బెంచ్‌లకు అధ్యక్షత వహించొచ్చు..
పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను క్లియర్ చేయడానికి తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమితులైన పదవీ విరమణ పొందిన హైకోర్టు జడ్జిలను సింగిల్ జడ్జ్ బెంచ్ లేదా డివిజన్ బెంచ్‌కు అధ్యక్షత వహించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఈ క్రమంలో మాజీ హైకోర్టు న్యాయమూర్తులను తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించడంపై ఒక విధానాన్ని రూపొందించాలని లేదా ఇప్పటికే ఉన్న దానిని మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
2021 ఏప్రిల్ 20న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ధర్మాసనం.. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను క్లియర్ చేయడానికి పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తులను రెండు మూడేండ్ల కాలానికి తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించవచ్చన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ మేరకు గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిల ధర్మాసనం ఆ ఉత్తర్వుల్లోని ఒక అంశాన్ని సవరించింది. మాజీ జడ్జిలు సింగిల్ జడ్జి బెంచ్‌లకు కూడా అధ్యక్షత వహించవచ్చని పేర్కొంది.
వీడియో చూసి..అప్పుడు మానవత్వం గురించి మాట్లాడండి
తాము ఓ వీడియో ప్లే చేసి చూపిస్తామని, అప్పుడు మానవత్వం అంటే ఏమిటో అడుగుతామని ఓ పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. వీధి కుక్కలను తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, వాటిని డిసెంబర్ చివరి వరకు అమలు చేయాలని చూస్తున్నదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
ఇది గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై విచారణను జనవరి 7న చేపడ్తామని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు పిటిషనర్ తరఫు అడ్వకేట్ కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే విచారించాలన్నారు. ఇందుకు బెంచ్ స్పందిస్తూ.. ‘‘మీ కోసం మేం తదుపరి విచారణలో ఓ వీడియో ప్లే చేస్తాం. అప్పుడు మానవత్వం అంటే ఏమిటో మిమ్మల్ని అడుగుతాం” అని పేర్కొంది.
