ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల నిరసనలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల నిరసనలు

కాశీబుగ్గ/ మహబూబాబాద్​అర్బన్/ ​జయశంకర్​ భూపాలపల్లి/ ములుగు, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ జాతీయ నాయకులు సోనియాగాంధీ, రాహుల్​ గాంధీలపై అక్రమ కేసులు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై గురువారం ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఈడీ ద్వారా అక్రమ కేసులతో కేంద్ర బీజేపీ సర్కారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మండిపడుతూ బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్​లను ముట్టడించారు. వరంగల్​ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్​ ఆయూబ్​ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఉద్రిక్తత  నెలకొన్నది. నిరసన తెలుపుతున్న డీసీసీ అధ్యక్షుడితోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులను పోలీసులు అరెస్ట్​ చేశారు. 

హనుమకొండ కాంగ్రెస్​ నాయకులు అంబేద్కర్ జంక్షన్​లో ధర్నా నిర్వహించారు.​  మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీనాయక్​ పాల్గొని బీజేపీ చేస్తున్న దౌర్జన్యాలపై మండిపడ్డారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆఫీస్​ ముట్టడి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్​, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్​, టీపీసీసీ మెంబర్​ చల్లూరి మధు, నాయకులతో కలిసి నిరసన తెలిపారు. 

ములుగులోని హైవే పై కాంగ్రెస్​మండలాధ్యక్షుడు ఎండీ.చాంద్​ పాషా ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా పంచాయతీరాజ్​శాఖ డైరెక్టర్​, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్​ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్​ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇలాంటి బెదిరింపులకు పార్టీ నేతలు భయపడరని, రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.