కొమ్ము.. కోయ నృత్యాలు వీరుల విల్లు, బాణం..ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ స్వాగత తోరణాలు

కొమ్ము.. కోయ నృత్యాలు వీరుల విల్లు, బాణం..ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ స్వాగత తోరణాలు
  • మేడారం జంక్షన్లలో నిర్మాణాలు 
  • తాడ్వాయి జంక్షన్, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్ చౌరస్తాలో పనులు 
  • చివరి దశకు చేరిన వర్క్స్

ములుగు/తాడ్వాయి, వెలుగు :  మేడారం జంక్షన్లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి. ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి, వన సంపద, వన్య ప్రాణుల బొమ్మలతో కనువిందు చేసేలా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో మాస్టర్​ప్లాన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టగా.. ఇందులో భాగంగా పాలరాతి శిల్పాలపై సమ్మక్క సారలమ్మ చరిత్రను చెక్కించి ప్రతిష్ఠిస్తున్నారు. జాతరకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు అపురూప జ్ఞాపకా లుగా మిగిల్చేలా పనులు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు మూడు జంక్షన్లను గిరిజన సంప్రదాయాలు, జంతు, పక్షిజాతుల బొమ్మల నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు.  

 కోయ నృత్యం, విల్లు బొమ్మలు 

ములుగు జిల్లా తాడ్వాయిలోని ప్రధాన స్వాగత తోరణం ఎదుట బ్యూటిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. చత్తీస్​గఢ్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్​వంటి ప్రాంతాల నుంచి తాడ్వాయి మీదుగా వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు  బాణం, విల్లు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వాగత తోరణానికి ఎదుట సమ్మక్క, సారలమ్మ గద్దెలతో నిర్మించిన రెండు సర్కిళ్లలో కోయ వీరులు విల్లుపై బాణం ఎక్కుపెట్టే బొమ్మ ఆకట్టుకుంటుంది.

 రెండు చేతుల్లో విల్లు, బాణం ఉండగా..  థింసా, కొమ్ము కోయ నృత్యాలతో ముగ్గురు మహిళలు, డోలక్​వాయించే ఇద్దరు వాయిద్యకారుల బొమ్మలను నిర్మించారు. ఇవి స్వాగత తోరణానికి ఇరువైపులా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వీటికి రంగులు వేస్తున్నారు. త్వరలో వాటర్​ఫౌంటెన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 

భక్తులకు కనువిందు చేసేలా నిర్మాణాలు

మేడారం ఆర్టీసీ సర్కిల్, హరిత హోటల్​సర్కిల్​, జంపన్నవాగు సమీపంలోని జంక్షన్లలోనూ ప్రత్యేక ఆకర్షణతో కూడిన బొమ్మలను రూపొందిస్తున్నారు. హరిత హోటల్ సమీపంలో కొండ కోనలు, గుట్టలపై జీవించే ఆదివాసీల జీవన శైలి చిత్రాలు ఉండనున్నాయి. చెట్లు, జంతువులు, పక్షుల ప్రతింబాలతోపాటు వాటర్​ఫౌంటైన్ చూపరులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఇక్కడే గిరిజన గూడేల్లో అమ్మమ్మ ముచ్చట చెబుతుండగా, పలువురు మహిళలు వింటూ, వడ్లు దంచుతూ ఉన్న బొమ్మ, కోయ గోండుల ఆయుధాలు, డప్పులతో నిలబడిన రెండు జంటల బొమ్మలు రూపొందుతున్నాయి.

 జంపన్నవాగు, ఆర్టీసీ జంక్షన్ లో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో నిర్మాణాలు చేస్తున్నారు. వచ్చే జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తజనులకు వనదేవతల గద్దెలతో పాటు జంక్షన్లు శోభాయమానంగా కనిపించనున్నాయి. పనులపై మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మేడారం జాతర అనంతరం తాడ్వాయి లోని స్వాగత తోరణం, జంపన్నవాగు వద్ద తోరణంతోపాటు గోవిందరావుపేట మండలం పస్రా వద్ద ఉన్న స్వాగత తోరణాలను రాతి శిలలతో నిర్మించనున్నారు. సుమారు రూ.కోటితో చేపడుతున్న పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి.