భారీ సైబర్ మోసం..1,500 మంది ఉన్న ఊర్లో..3 నెలల్లోనే 27 వేల జననాలు!

భారీ సైబర్ మోసం..1,500 మంది ఉన్న ఊర్లో..3 నెలల్లోనే 27 వేల జననాలు!
  • మహారాష్ట్రలో భారీ సైబర్ మోసం వెలుగులోకి 

ముంబై: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. కేవలం 1,500 మంది మాత్రమే ఉన్న అర్ని తాలూకా షెండురుసాని గ్రామంలో 3 నెలల వ్యవధిలోనే 27,397 మంది పుట్టినట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) రికార్డుల్లో నమోదైంది. ఇది చూసి అధికారులే నివ్వెరపోయారు. ఈ జననాలన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు రికార్డుల్లోకి ఎక్కాయి. 

కేవలం ఏడుగురే చనిపోయినట్లు నమోదు చేశారు. ఆలస్యంగా నమోదైన జననాల రికార్డుల్లో చాలా వరకు 18 ఏండ్లు పైబడిన వయసు గలవారినే చేర్చగా.. వారిలో అసలు మహారాష్ట్రకు చెందినవారే లేకపోవడం మరో విచిత్రం. 

అందరూ పశ్చిమ బెంగాల్, యూపీ వంటి రాష్ట్రాలకు చెందినవారేనని తేలింది. ఆలస్య జనన, మరణ రిజిస్ట్రేషన్ల ప్రత్యేక వెరిఫికేషన్ డ్రైవ్ సందర్భంగా ఇదంతా బయటపడింది. గ్రామ పంచాయతీ సీఆర్ఎస్ లాగిన్ క్రెడెన్షియల్స్‌‌‌‌ను హ్యాకర్లు చోరీ చేసినట్లు, రికార్డులను తారుమారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.