కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 విశ్లేషణాత్మక కోణంలో చూస్తే మోడీ సర్కార్ ఫాలో అయిన ఒక ఆసక్తికరమైన వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న రాష్ట్ర-స్థాయి వరాల బాటను కాదని.. ఈసారి మోడీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి - రాజకీయ సమతుల్యత అనే ఫార్ములాను నమ్ముకుంది. ప్రత్యక్షంగా ఉచితాలు ప్రకటించకుండానే.. తన ప్రధాన మిత్రపక్షాలైన TDP, జనతాదళ్ (యునైటెడ్ - JDU) కోరిన కీలక డిమాండ్లను నెరవేరుస్తూనే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మౌలిక వసతుల రూపంలో భారీ కేటాయింపులు చేసి అనుమానం రాకుండా టార్గెట్ ఫినిష్ చేసింది.
ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు మార్క్ డిమాండ్లకు ఆమోదం
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అందిన కేటాయింపులు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం సాగాయి. ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా డేటా సెంటర్లకు 2047 వరకు టాక్స్ హాలిడే ప్రకటించడం అతిపెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.
* డేటా సెంటర్ల విప్లవం: విదేశీ కంపెనీలు భారతీయ డేటా సెంటర్లను వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందిస్తే.. వారికి ఈ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది ఏపీలోని విశాఖపట్నం వంటి తీరప్రాంత నగరాలకు వరంగా మారనుంది.
* పర్యాటక ప్రాజెక్టులు: అరకు వ్యాలీలో ఎకో-సస్టైనబుల్ మౌంటైన్ ట్రయల్స్, పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ ట్రయల్స్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త రూపు ఇవ్వనున్నాయి.
* రైతులకు మేలు: కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు ప్రకటించిన కొత్త స్కీమ్ కోనసీమ రైతులకు పెద్ద ఊరటగా నిలవనుంది. అలాగే 'పూర్వోదయ' స్కీమ్ కింద పారిశ్రామికాభివృద్ధికి అదనపు బలాన్ని చేకూర్చారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
బీహార్: మౌలిక వసతులే లక్ష్యంగా..
ఇక నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు ఎన్డీఏకు కీలకం కావడంతో.. బీహార్‌కు రవాణా అండ్ లాజిస్టిక్స్ రంగంలో భారీ ప్రాధాన్యత దక్కింది. వారణాసి-పాట్నా మధ్య షిప్ రిపేర్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల గంగానది ద్వారా జరిగే జల రవాణా మరింత చౌకగా మారుతుంది. ఇది రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు 'లాంగ్ టర్మ్' గిఫ్ట్స్
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి విడివిడిగా ఉచిత పథకాలు ప్రకటించకుండా.. మోడీ సర్కార్ ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను శాసించే పెద్ద ప్రాజెక్టులను కేటాయించింది.
* హై-స్పీడ్ రైల్ కారిడార్లు: హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు తమిళనాడుకు, సిలిగురి-వారణాసి కారిడార్ బెంగాల్‌కు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి.
* రేర్ ఎర్త్ కారిడార్: గ్లోబల్ డిమాండ్ ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీత కోసం తమిళనాడు, కేరళ, ఏపీలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌ను ప్రకటించారు.
* అస్సాంకు పర్యాటక ఊతం: ఈశాన్య రాష్ట్రాల్లో 'బుద్ధిస్ట్ సర్క్యూట్' అభివృద్ధి ద్వారా అస్సాంలో పర్యాటక ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు నిర్మలా సీతారామన్.
మొత్తంగా చూస్తే ఈసారి బడ్జెట్ ద్వారా మోడీ ప్రభుత్వం రాజకీయ మిత్రులను సంతృప్తి పరుస్తూనే.. దేశాభివృద్ధికి పెద్ద పీఠం వేయడం అనే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. దీంతో మోడీ అరకు నుంచి పాట్నా వరకూ లెక్కలు సెట్ చేశారని తేలిపోయింది.
