బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట

బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట

ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అన్ని వర్గాలకు భారీగా కేటాయింపులు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని సర్కారు 65 నుంచి 57కు తగ్గించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయో పరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులను ఎంపిక చేసి వారి ఆసరా పింఛన్లు అందించనుంది. వార్షిక బడ్జెట్ లో ఇందుకోసం 11,728 కోట్లు ప్రతిపాదించింది. 

ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు
సొంత జాగా కలిగిన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల చొప్పున అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇందుకు అవసరమైన మైన నిధులను బడ్జెట్ లో కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున ఇస్తామన్న మంత్రి నియోజకవర్గానికి 3వేల ఇండ్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం.. రూ.12,000కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎఫ్డీఎఫ్ నిధుల నుంచి రూ.1000కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించారు. గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.600కోట్లు వెచ్చించనున్నారు. 

గొల్ల కురుమలు, గీత కార్మికులకు గుడ్ న్యూస్
రాష్ట్రంలో గొల్ల కురుమల సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో రూ.1000కోట్లు ప్రతిపాదించింది. రూ.11వేల కోట్ల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని హరీష్ రావు చెప్పారు. ఇక గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించింది. రైతుల బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 5లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లు ఇవ్వాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. 

దూప దీప నైవేద్యాలకు రూ.12.50కోట్లు
దూప దీప నైవేద్య పథకంలో హైదరాబాద్ లోని ఆలయాలను చేర్చాలన్న అర్చకుల విన్నపాన్ని ప్రభుత్వం మన్నించింది. ఈ ఏడాది కొత్తగా 1736 దేవాలయాలను ఈ పథకంలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. దూపదీప నైవేద్య పథకానికి ఈ ఏడాది బడ్జెట్ లో 12.50 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్