బడ్జెట్ బడులను బతికించాలి

బడ్జెట్ బడులను బతికించాలి

రాష్ట్రంలో టీచర్లూ, స్టూడెంట్లూ ప్రైవేట్ బాట పట్టడానికి కారణం టీఆర్ఎస్​ ప్రభుత్వమే. ఆరేండ్లుగా ఒక్క డీఎస్సీ లేదు, దీంతో క్వాలిఫైడ్ టీచర్లు అయిదారు వేల రూపాయలకైనా ప్రైవేట్ స్కూల్స్​లో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో ఉన్న ఆధారం కూడా కోల్పోయారు. రాష్ట్రంలో ఎక్కువ మంది స్టూడెంట్లు చదివేది ప్రైవేటులోని బడ్జెట్​ బడుల్లోనే. కరోనా మహమ్మారి కారణంగా అవి కూడా కుదేలయ్యాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే అవి నిలదొక్కుకుంటాయి. స్టూడెంట్లకు, మేనేజ్​మెంట్​కు ఇది పెద్ద ఊరటగా నిలుస్తుంది. అట్లనే జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న టీచర్లకు నెలకు రూ.7,500 ప్రభుత్వమే చెల్లించాలి. దీనికి సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతాయి. ఇదేమీ వృథా ఖర్చుగా భావించనక్కరలేదు. ఈ మొత్తం మళ్లీ ఎకానమీలోకి వస్తుంది. ఎంతో మందికి పరోక్షంగా పని దొరుకుతుంది.

సర్కారీ బడులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల స్కూళ్లను మూసేసిన సర్కారు.. తర్వలో మరో నాలుగున్నర వేల స్కూళ్లను బంద్ పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేద ప్రజలకు విద్యనందించడంలో ముందుండాల్సిన గవర్నమెంట్ దానికి దూరంగా జరగడంతో ప్రైవేటు స్కూళ్లు ఆ గ్యాప్ లో చొరబడిపోతున్నాయి. ఇప్పడు రాష్ట్రంలో 55 శాతం మంది స్టూడెంట్లు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పాలసీ అంటూ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా కారణంగా ఫీజులు కట్టలేక పేద ప్రజలు, డబ్బు రానిదే నడవలేని స్థితిలో ప్రైవేటు స్కూళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు నిలదొక్కుకున్నప్పటికీ.. పేద, మధ్యతరగతి పిల్లలు చదివే బడ్జెట్ స్కూళ్లు ఎన్నో మూతపడ్డాయి. ఫీజులు రాక, జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు చేతులెత్తేయడంతో ప్రైవేటు టీచర్లు కూలి చేసుకుని బతుకుతున్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు రోడ్డున పడ్డారు. వీళ్లందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

సన్నాలకు మద్దతు ధర ఇవ్వాలి

రైతే రాజు, వ్యవసాయం పండుగ అంటూ నినాదాలు ఇస్తూ.. ఆచరణలో మాత్రం వ్యవసాయాన్ని కూడా కుదేలు చేసింది ప్రభుత్వం. ఏ అర్ధరాత్రో కలలో వచ్చిన ఐడియాలతో చట్టాలు చేస్తున్నారు. స్థానిక పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం చేసుకునే రైతుల నోట్లో మట్టికొట్టిన్రు. నియంత్రిత సాగు పేరుతో సన్న వడ్లు వేయాలని హుకుం జారీ చేసిన్రు. లేకపోతె రైతు బంధు ఇవ్వం,  మద్దతు ధర దక్కదు అంటూ బెదిరించిన్రు. కేసీఆర్ మాటలు విని సన్న వడ్లు వేస్తే ఇప్పుడు ఆయన నట్టేట ముంచిండు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సన్నాలకు మద్దతు ధర ఇచ్చి కొనాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

20 వేల కోట్లు దండుకునే ఆలోచన

కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ పేరుతో దౌర్భాగ్యమైన విధానం తీసుకొచ్చింది. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై దెబ్బపడింది.  ఎల్ఆర్ఎస్ కారణంగా రాష్ట్రంలో భూములు కొనేవారు, అమ్మేవారు.. ఎవరూ సుఖంగా లేరు. ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దండుకోవాలని చూడడం దుర్మార్గం. పోనీ ఇవేమన్నా ప్రజాసంక్షేమం కోసం వాడుతారా? ఆ వచ్చే సొమ్ములో రూ.350 కోట్లతో ప్రైవేటు టీచర్లను ఆదుకుంటారా? అంటే అదీ లేదు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెడుతారు. ఎన్నికల్లో ఓట్లు కొనడానికి వాడుతారు.

కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం

ఎన్నికల భాష తప్ప మరేమీ అర్థం కాని కేసీఆర్ కు ప్రైవేట్ టీచర్లు, నిరుద్యోగులు, విద్యార్థుల తలిదండ్రులూ అదే భాషలో సమాధానం చెప్పాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలూ అందుకు ఒక మార్గం. పట్టభద్రులు అందరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్ నేటికీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. ఈ రెండేండ్లలో ప్రతి నిరుద్యోగికీ కేసీఆర్ రూ.72,834 బాకీ పడ్డారు. యువకులు, నిరుద్యోగులు, టీచర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రైతులు, కూలీలు.. ఈ నియంతృత్వ ప్రభుత్వంపై కొట్లాడాలి. ఓటుతో గుణపాఠం చెప్పాలి.– శ్రీశైల్ రెడ్డి పంజుగుల, టీజేఎస్ నేత.