పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఒకరోజు పొడిగింపు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఒకరోజు పొడిగింపు
  • 10 వరకు కొనసాగుతాయని ప్రకటించిన లోక్​సభ

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఒక రోజు(ఫిబ్రవరి 10 వరకు) పొడిగిస్తున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభలో ప్రకటించారు. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియాల్సి ఉంది. ఆర్థిక బిల్లు, బడ్జెట్ పై చర్చ, శ్వేత పత్రం విడుదల వంటి అంశాలకు సంబంధించిన కార్యకలాపాల దృష్ట్యా సెషన్ టైం పొడిగించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ ముఖ్యమైన కార్యకలాపాల కారణంగానే సెషన్ టైం పొడిగించాలని స్పీకర్​ను కోరినట్లు​ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభకు తెలియజేశారు. చివరి రోజు ఎజెండా ఏంటనేది మాత్రం చెప్పలేదు.

అయితే, కాంగ్రెస్ పదేండ్ల పాలనలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సభలో శ్వేతపత్రం విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. అదే క్రమంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా పుంజుకుందో హైలెట్ చేసేందుకే సమావేశాలను పొడిగించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.