
దేశంలో అన్ని రంగాలపై ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఈ సమయంలో రాష్ట్ర వాస్తవ పరిస్థితులకు తగినట్లు బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ త్వరలోనే అసెంబ్లీలో పెడతామని చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనలపై క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది సర్కార్.
ఆర్థిక మాంద్యంతో అన్ని రాష్ట్రాల ఆదాయం బాగా తగ్గిందన్నారు కేసీఆర్. దీంతో రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే .. మిగిలిన రంగాలకు అవసరమైన మేరకు కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదలనలు ఫైనల్ అయ్యాక, మంత్రివర్గ సమావేశం, ఆతర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం.
సమీక్ష సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.