జపాన్ లో బుల్లెట్ ట్రైన్ సేవలు రద్దు

జపాన్ లో బుల్లెట్ ట్రైన్ సేవలు రద్దు

టోక్యో : భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. సోమవారం సాయంత్రం 90‌‌‌‌ నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. ప్రతి సారీ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 4.0 పైనే నమోదైందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. జపాన్​లోని ఇషికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో భూమి కంపించింది. మొదట 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయని, ఒక దశలో తీవ్రత రిక్టర్‌‌ స్కేల్‌‌పై 7.6గా నమోదైందని వివరించింది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు, ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో ముందుగా భూమి కంపించింది. తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో అక్కడి రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్​లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

బుల్లెట్ ట్రైన్ సేవలు రద్దు

భూకంప కేంద్రం చుట్టూ ఉన్న టయోమా, ఇషికావా, నైగటా రాష్ట్రాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 33,500 కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. మూడు రాష్ట్రాల చుట్టూ ఉన్న మేజర్ హైవేలను అధికారులు మూసేశారు. అండర్ గ్రౌండ్ రైల్వే సేవలు ఆపేశారు. టోక్యో, భూకంప ప్రభావిత రాష్ట్రాల మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు కూడా నిలిపేశారు. ఇంకా భూకంపం ముప్పు పొంచి ఉండటంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైనే గడుపుతున్నారు. కొంత మంది అవసరమైన వస్తువులు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.