తెలంగాణ నర్సులకు విదేశాల్లో బంపర్ ఆఫర్

తెలంగాణ నర్సులకు విదేశాల్లో బంపర్ ఆఫర్
  • టామ్‌‌‌‌‌‌‌‌కామ్, గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య కీలక ఒప్పందం
  • కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఎంవోయూ
  • నర్సులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తామన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞులైన నర్సులకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మాన్‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌‌‌‌‌కామ్), గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ ఫ్యాక్టరీస్) శాఖ మంత్రి ​వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరప్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు దేశాల్లో నైపుణ్యం కలిగిన మన దేశ నర్సులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందన్నారు. ఆ అవకాశాలను రాష్ట్ర యువతకు అందించేందుకు ప్రభుత్వం టామ్‌‌‌‌‌‌‌‌కామ్ ద్వారా సమగ్ర కార్యాచరణ చేపట్టిందని తెలిపారు."అర్హులైన నర్సులను గుర్తించడం, ఇంటర్వ్యూలు నిర్వహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. విదేశీ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

టామ్‌‌‌‌‌‌‌‌కామ్ – గ్లోబల్ నర్స్ ఫోర్స్ భాగస్వామ్యంతో నర్సులకు విదేశీ ఉద్యోగాలకు అవసరమైన జర్మన్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర విదేశీ భాషా శిక్షణ, క్లినికల్ కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, వీసా, లైసెన్సింగ్, ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ తదితర అంశాల్లో సమగ్ర సహకారం అందించనున్నట్లు వివరించారు. నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నియామకాలు తెలంగాణ యువతకే కాకుండా ఆయా దేశాల ఆరోగ్య రంగానికి కూడా తోడ్పడతాయని సూచించారు.

అభ్యర్థులకు అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వాలని, శిక్షణ, నియామకాల నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ నైపుణ్యాన్ని ప్రపంచ ఉపాధి అవకాశాలతో అనుసంధానించేలా టామ్‌‌‌‌‌‌‌‌కామ్ పనిచేస్తోందని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐఏఎస్, టామ్‌‌‌‌‌‌‌‌కామ్ జనరల్ మేనేజర్, గ్లోబల్ నర్స్ ఫోర్స్ ప్రతినిధి పరమానంద సంత్రా తదితరులు పాల్గొన్నారు.