లార్డ్స్‌‌‌‌ టెస్టుకు పేస్‌ పిచ్‌‌‌‌.. బరిలోకి స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా

లార్డ్స్‌‌‌‌ టెస్టుకు పేస్‌ పిచ్‌‌‌‌.. బరిలోకి స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా

లండన్‌‌‌‌: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య అండర్సన్‌‌‌‌–టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌ను అలరిస్తోంది. తొలి మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లిష్ టీమ్ నెగ్గితే.. రెండో టెస్టులో శుభ్‌‌‌‌మన్ గిల్ సేన భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. దాంతో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో కీలకమైన మూడో టెస్టుపై ఇప్పుడు అందరి ఫోకస్‌‌‌‌ నిలిచింది. గురువారం (జులై 10) నుంచి ప్రఖ్యాత లార్డ్స్‌‌‌‌ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ఆతిథ్య ఇంగ్లిష్​ టీమ్ అభ్యర్థన మేరకు పేస్ వికెట్‌‌‌‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. 

ఇప్పటివరకు తమ బజ్‌‌‌‌బాల్‌‌‌‌ గేమ్‌‌‌‌కు సరిపోయేలా బెన్ స్టోక్స్ సేన ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌లకు మొగ్గు చూపింది. కానీ, ఎడ్జ్‌‌‌‌బాస్టన్‌‌‌‌ టెస్టులో ప్రతికూల ఫలితం వచ్చిన నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ తమ ప్లాన్‌‌‌‌ మార్చుకొని పేసర్లకు అనుకూలించే పిచ్‌‌‌‌ కావాలని అడిగినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌‌‌‌కు మరో 48 గంటల ముందు లార్డ్స్‌‌‌‌ స్టేడియంలోని వికెట్‌‌‌‌ పచ్చటి పచ్చికతో కనిపిస్తోంది. దానికి నీళ్లు కూడా పడుతున్నారు. 

గ్రౌండ్ స్టాఫ్‌‌‌‌  పిచ్‌‌‌‌కు తుదిరూపు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ వికెట్‌‌‌‌పై మంచి పేస్‌‌‌‌తో పాటు బౌన్స్‌‌‌‌ కూడా లభించడం ఖాయమని తెలుస్తోంది. ఈ పిచ్‌‌‌‌పై  స్టార్ పేసర్‌‌‌‌‌‌‌‌ జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌, గస్ అట్కిన్సన్‌‌‌‌ను బరిలోకి దింపి ఇండియా బ్యాటర్లకు ముకుతాడు వేయాలని ఇంగ్లిష్ టీమ్ ఆశిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆర్చర్ లార్డ్స్‌‌‌‌ టెస్టుతో రీఎంట్రీ ఇవ్వనుండగా.. కండరాల నొప్పితో తొలి రెండు టెస్టులకు దూరమైన అట్కిన్సన్‌‌‌‌ కూడా తుది జట్టు ఎంపికకు అందుబాటులోకి రానున్నాడు. ఈ ఇద్దరి చేరికతో ఆతిథ్య పేస్ విభాగం బలంగా మారనుంది.

జోరుగా బుమ్రా ప్రాక్టీస్‌‌‌‌

బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో భారీ విజయం అందుకొని ఒక రోజు విశ్రాంతి తీసుకున్న ఇండియా మూడో టెస్టు కోసం మంగళవారం లార్డ్స్‌‌‌‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నెట్ సెషన్‌‌‌‌లో స్టార్ పేసర్ జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రాక్టీస్ సెషన్‌‌‌‌లో బుమ్రా బాల్‌‌‌‌ను  రెండు వైపులా కదిలిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్ చేయనప్పుడు సరదాగా కనిపించిన అతను బాల్‌‌‌‌ అందుకోగానే పూర్తి ఏకాగ్రతతో కనిపించాడు. 

దాదాపు 45 నిమిషాల పాటు పూర్తి వేగంతో బౌలింగ్ చేశాడు. నెట్స్‌‌‌‌లో కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, ధ్రువ్ జురెల్‌‌‌‌ అతడిని ఎదుర్కొన్నారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో మాట్లాడిన బుమ్రా కొద్దిసేపు బ్యాటింగ్ కూడా చేశాడు. గంభీర్ తో కలిసి  పిచ్‌‌‌‌ను దగ్గరి నుంచి పరిశీలించాడు.  జడేజాతో కోచ్ సుదీర్ఘంగా చర్చించాడు. 

 వర్క్‌‌‌‌లోడ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా రెండో మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉన్న పేస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌.. లార్డ్స్‌‌‌‌ టెస్టులో కచ్చితంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీలో  ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌, సిరాజ్‌‌‌‌ గత పోరులో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసి ఇండియాను గెలిపించారు. ఇప్పుడు గ్రీన్ వికెట్‌‌‌‌పై బుమ్రా కూడా తుది జట్టులోకి వస్తే ఇండియా ఆత్మవిశ్వాసం పెరగనుంది. 

కరుణ్‌‌‌‌కు మరో చాన్స్‌‌‌‌!

మరోవైపు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్  కూడా నెట్స్‌‌‌‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. తను పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ ముఖ్యంగా ఇంగ్లిష్ పరిస్థితులకు తగ్గట్టుగా ఔట్‌‌‌‌ సైడ్ ఆఫ్ స్టంప్స్‌‌‌‌ బాల్స్‌‌‌‌ను ఆడటంపై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టులోనూ తను మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా బౌలింగ్‌‌‌‌ను కూడా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఎదుర్కోవడంతో  సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ పోటీలో ఉన్నప్పటికీ కరుణ్‌‌‌‌కు మరో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఆల్‌‌‌‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా మరో చాన్స్‌‌‌‌ ఇవ్వాలని మేనేజ్‌‌‌‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆప్షనల్ సెషన్ కావడంతో కెప్టెన్ గిల్‌‌‌‌, పంత్‌‌‌‌తో పాటు జైస్వాల్‌‌‌‌, రాహుల్‌‌‌‌, ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేయలేదు. పేసర్లు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ తో పాటు నితీశ్‌‌‌‌ నెట్స్‌‌‌‌లో బౌలింగ్ చేశాడు.  కాగా, మంగళవారం ఇంగ్లండ్ తమ ప్రాక్టీస్ సెషన్‌‌‌‌తో పాటు ప్రెన్స్ కాన్ఫరెన్స్  రద్దు చేసుకోవడం గమనార్హం.  ఇండియా బుధవారం తమ చివరి ప్రాక్టీస్ సెషన్‌‌‌‌లో పాల్గొని తుది జట్టుపై ఓ అంచనాకు రానుంది.