తీరం వెంబడి కొట్టుకుపోతున్న నౌక

తీరం వెంబడి కొట్టుకుపోతున్న నౌక

అజోర్స్ (పోర్చుగల్): ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని పోర్చుగీస్ తీరంలో లగ్జరీ కార్లతో వెళ్తున్న నౌక మంటల్లో చిక్కుకుంది. అందులోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడగా.. కార్గో షిప్ మాత్రం పోర్చుగల్‌‌‌‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఈ నౌక ఈనెల 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరింది. అమెరికా రోడ్ ఐలాండ్‌‌‌‌లోని డేవిస్‌‌‌‌విల్లే పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. కానీ అజోర్స్‌‌‌‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌‌‌‌లో మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి మంటలు కొనసాగుతున్నాయి. ఈ నౌకలో 189 బెంట్లీ కార్లు, 1,100 పోర్షే కార్లు, ఫోక్స్‌‌‌‌వాగన్, ఆడి  కార్లతో సహా మొత్తం 3,965 లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు పోర్చుగీస్ నేవీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎంత మేర నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘ఫెలిసిటీ ఏస్’ నౌక మూడు ఫుట్ బాల్ స్టేడియాలకు సమానమైన సైజ్ ఉంటుందని తెలుస్తోంది.