- స్థానిక అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు
హైదరాబాద్సిటీ/గండిపేట, వెలుగు : మణికొండలోని పైప్‌లైన్ రోడ్డులో మంజీరా నీటి సరఫరా పైప్‌లైన్ (1200 ఎంఎం) పగిలి భారీ వాటర్ లీకేజీ ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి లీకేజీ ఏర్పడటంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది సెల్లార్లలో నీటిని పంపింగ్ ద్వారా తొలగించే పనులు చేపట్టారు. అంతకుముందే పరిసర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు. మణికొండ నుంచి షేక్‌పేట్ వెళ్లే మెయిన్ రోడ్డు కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఉదయం లీకేజీ జరిగిన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఖానాపూర్ నుంచి భోజగుట్ట వరకు వెళ్లే పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలినట్లు గుర్తించారు. పనులు పూర్తయ్యాక రోడ్డు రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. నగరానికి మంజీరా, సింగూరు నుంచి నీటి సరఫరా చేసే పైప్‌లైన్లన్నీ 1975లో వేసినవి కావడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని వాటర్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు. కాగా..పైప్‌లైన్ లీకేజీ కారణంగా గండిపేట్, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు, బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేస్తున్నట్లు వాటర్‌బోర్డు తెలిపింది.
