మణిపూర్‌‌లో జవాన్ల బస్సుకు నిప్పు .. కుకీల పనేనని అనుమానం

మణిపూర్‌‌లో జవాన్ల బస్సుకు నిప్పు .. కుకీల పనేనని అనుమానం

ఇంఫాల్‌‌: మణిపూర్‌‌లోని హిల్ జిల్లాలో సెంట్రల్‌‌ రిజర్వ్‌‌ పోలీస్‌‌ ఫోర్స్‌‌ (సీఆర్‌‌పీఎఫ్‌‌) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. సోమవారం రాత్రి 9 గంటలకు కాంగ్‌‌పోక్పిలో బస్సును దుండగులు అడ్డగించారు. బస్సు నుంచి కిందకి దిగాల్సిందిగా సీఆర్‌‌పీఎఫ్‌‌ సిబ్బందిని బెదిరించారు. అనంతరం బస్సుకు నిప్పుపెట్టారని పోలీసులు వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసిందని.. ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.

 ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై కాంగ్‌‌పోక్పిలోని పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. కుకీల ప్రాబల్యం ఉన్న హిల్ జిల్లాలో కొందరు అనుమానితులను ప్రశ్నించామని పోలీసులు చెప్పారు. సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలను కాంగ్‌‌పోక్పి జిల్లా కమిషనర్ కార్యాలయానికి తరలించేందుకు బస్సును అద్దెకు తీసుకున్నామన్నారు. బస్సు మొయితీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిది కావడంతో దానికి కుకీ వర్గం వాళ్లే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.