
జూబ్లీహిల్స్, వెలుగు: ఎంతో మంది వద్ద బంగారం తాకట్టు పెట్టుకున్న ఓ వ్యాపారి షాపు బంద్ చేసి పరారయ్యాడు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఫిలింనగర్ గౌతమ్ నగర్ బస్తీలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాణిక్ చౌదరి కొంతకాలంగా బంగారం షాపును నిర్వహిస్తున్నాడు. బంగారం తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తుంటాడు. కొద్దిరోజులుగా షాపు తీయడం లేదు. అనుమానం వచ్చిన కస్టమర్లు ఫోన్ లో సంప్రదిస్తే అందుబాటులోకి రావడం లేదు.
దీంతో తమను మోసం చేశాడని గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. పదుల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్మెట్లు ఎక్కుతున్నారు. దాదాపు రూ.కోటి విలువైన బంగారంతో ఆయన ఉడాయించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.