హాంగ్‌జౌ: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బోణీ చేసింది. బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ గ్రూప్–బి తొలి మ్యాచ్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్లు సాత్విక్–చిరాగ్ 12–21, 22–20, 21–14తో వరల్డ్ ఐదో ర్యాంకర్లు లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)పై గెలిచారు. గంట పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ద్వయం తొలి గేమ్‌ను చేజార్చుకుంది. 7–7తో స్కోరు సమమైన తర్వాత సాత్విక్–చిరాగ్ ఎక్కువగా తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు.
అయితే 2–4తో రెండో గేమ్‌ను మొదలుపెట్టిన ఇండియన్ ప్లేయర్లకు చైనీయుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓ దశలో 31 షాట్స్ ర్యాలీ ఆడారు. రెండు జంటలు పోటాపోటీగా తలపడటంతో స్కోరు18–18, 19–19, 20–20తో ముందుకెళ్లింది. ఈ టైమ్‌లో లియాంగ్ కొట్టిన షాట్ నెట్‌కు తాకడం, ఆ వెంటనే చిరాగ్ బలమైన స్మాష్‌తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక డిసైడర్ కూడా హోరాహోరీగానే మొదలైంది. దాంతో 14–14 వరకు ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే చైనీయులు నెట్ ఎర్రర్స్ చేయడంతో చిరాగ్ జోడీ వరుసగా ఏడు మ్యాచ్ పాయింట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగే మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్... ఫజర్ అల్ఫియాన్–మహ్మద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా)తో తలపడతారు.
