
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. మునుగోడులో ఇన్నాళ్లు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయామని అక్కడి ప్రజలు అనుకున్నారని..ఇప్పుడు సమయం వచ్చిందనుకుంటున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు టీఆర్ఎస్ నేతలతో సమావేశమైనట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారని..ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికకు తామంతా సిద్ధంగా ఉన్నామని వారంతా చెప్పినట్లు జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మునుగోడులో టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగా మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి చేసిందేమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంచలన ప్రకటనలు చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం అని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం మాత్రమే ఉప ఎన్నిక తీసుకొచ్చారని.. ఆయన్ను ప్రజలు ఎండగట్టాలన్నారు.
మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తులు లేవని జగదీశ్ రెడ్డి అన్నారు. అందరూ ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వానికి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు. ఫ్లోరోసిస్‌ను నల్లగొండ జిల్లా నుంచి సీఎం కేసీఆర్ తరిమికొట్టారని..అందుకే మిషన్ భగీరథను తీసుకొచ్చారని చెప్పారు.
మరోవైపు మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను కలుద్దామని భావించారు. అయితే కొద్దిసేపు కేసీఆర్ కోసం నేతలు వేచి చూశారు. కానీ సీఎం బిజీగా ఉన్నారని..తర్వాత కలుద్దామని చెప్పడంతో నేతలు నిరుత్సాహంతో వెనుదిరిగారు.