మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది
  • ఈ నెల 7 నుంచి నామినేషన్లు.. వచ్చే నెల 6న రిజల్ట్స్​
  • ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్న పార్టీలు
  • దేశ వ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 7 స్థానాలకు షెడ్యూల్​

హైదరాబాద్​, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది. వచ్చే నెల 3న పోలింగ్​ జరగనుంది. అదే నెల 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్​ను ప్రకటించింది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేయడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికపై రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో దీన్ని లీడర్లు సెమీఫైనల్​గా భావిస్తున్నారు. అక్కడ విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ వ్యూహాలు రచిస్తున్నాయి. 

7న నోటిఫికేషన్​

ఈ నెల 7న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్​ నోటిఫికేషన్  రిలీజ్​ కానుంది. అదే రోజు నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 15న స్ర్కూటినీ, 17 వరకు నామినేషన్ల విత్​ డ్రాకు ఈసీ గడువు ఇచ్చింది. 2022 జనవరి ఒకటో తేదీ అర్హతగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడుతో పాటు 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్​ 3న పోలింగ్​ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. 

3 నెలల ముందు నుంచే హీట్​

కాంగ్రెస్​ నుంచి 2018లో  మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి ఆగస్టు 8న రాజీనామా చేశారు. అంతకంటే 15 రోజుల ముందు నుంచే మునుగోడులో రాజకీయం హీటెక్కింది. 

..బైపోల్​ నవంబర్​ 3న

రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్​ను మండలంగా  ప్రకటించడంతో అప్పటి నుంచే అధికార పార్టీ బై ఎలక్షన్​ ఖాయమని డిసైడ్​ అయింది. ఆ తర్వాత రాజగోపాల్​ రాజీనామా చేయ డం.. బీజేపీలో చేరడం జరిగిపోయింది. బీజేపీ నుంచి రాజగోపాల్​ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ పాల్వాయి స్రవంతిని తన అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ.. ఓటర్లను ఆకట్టుకునేందకు మూడు నెలల కిందటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. మునుగోడు స్థానం ఖాళీ అయిన వారం, పది రోజుల్లోనే నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు సొమ్మును జమ చేసింది. ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టింది. అన్ని పార్టీలు తమదైన పద్ధతుల్లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఎలక్షన్​కు ఇంకా నెల రోజుల టైమే ఉండటంతో ప్రచార జోరు పెరుగనుంది. ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ,  వైఎస్సార్​టీపీ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించాయి. హుజూరాబాద్​బై ఎలక్షన్​  గతేడాది నవంబర్​లో జరిగింది. అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్  టీఆర్ఎస్​పై ఘన విజయం సాధించారు. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్​ కూడా నవంబర్​లో జరుగుతున్నది. మునుగోడులోనూ హుజూరాబాద్​ రిజల్ట్సే రిపీట్​ అవుతాయని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  

నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో ఎలక్షన్​ కోడ్​

మునుగోడు బై ఎలక్షన్​కు షెడ్యూల్​ విడుదల కావడంతో ఆ నియోజకవర్గం ఉన్న నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినట్లు సీఈవో వికాస్​ రాజ్​ స్పష్టం చేశారు. కొత్త పథకాలు, ఓటర్లను మభ్య పెట్టేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవీ చేపట్టడానికి వీల్లేదని అన్నారు. అధికారులంతా ఈసీ నిబంధనలకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆదేశించారు. ఏమైనా అనుమానాలు ఉంటే ఈసీ నుంచి పర్మిషన్​ తీసుకోవాలని చెప్పారు.