
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆదివారం (ఆగస్ట్ 24) భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై చర్చించనుంది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదుల సలహాలు, సూచనలు స్వీకరించనుంది కేబినెట్ సబ్ కమిటీ. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం.. ఆగస్ట్ 28వ తేదీ లోపు కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఆగస్ట్ 29న కేబినెట్ సమావేశం నిర్వహించి సబ్ కమిటీ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.
►ALSO READ | 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తాం: సీఎం రేవంత్
శనివారం (ఆగస్ట్ 23) గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం మంత్రులతో కమిటీని నియమించాలని పీఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌తో చర్చించి కమిటీని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ ప్రకటించారు. మంత్రుల కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు.
దేశంలోని నిష్ణాతులైన న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి.. ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండడంతో రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో కమిటీ సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.