నాగర్‌కర్నూల్,వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద కృష్ణా నదిపై త్వరలో కేబుల్ బ్రిడ్జి పనులు ప్రారంభించి...సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా. మహేంద్రనాథ్ పాండే హామీ ఇచ్చారు. ఆదివారం సోమశిల–- సిద్దేశ్వరం కేబుల్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. కృష్ణానదిలో మరబోటులో నిర్మాణ ప్రదేశానికి వెళ్లి ఇంజినీర్లతో మాట్లాడారు. హైవేతో పాటు నదిపై కేబుల్‌బ్రిడ్జి నిర్మాణంతో కొల్లాపూర్ రూపురేఖలు మారిపోతాయన్నారు. టూరిజం, పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య దూరభారం తగ్గుతుందన్నారు. మెరుగైన రవాణా అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం లలితా సోమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు.
ప్రధాని చేసిన పనులు చెప్పండి
కొల్లాపూర్ బీజేపీ ఆఫీస్‌లో సోషల్‌మీడియా ఇన్ చార్జీలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాల గురించి, కేంద్ర నిధులను మళ్లిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై వార్త కథనాలు రాయాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, దిలీపాచారి, శేఖర్,రోజా రమణి, రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

