నలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు

నలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు
  • నలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు
  • పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ  కలకత్తా హైకోర్టు తీర్పు

కోల్ కతా: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురు లష్కరే తాయిబా టెర్రరిస్టులకు ఉరిశిక్షను రద్దు చేసింది. దేశంపై యుద్ధం ప్రకటించారని నలుగురినీ కింది కోర్టు దోషులుగా తేల్చగా..  హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇతర నేరాల కింద దోషులకు పదేండ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఈమేరకు జస్టిస్ జోయమాల్య బాగ్చీ, జస్టిస్ అనన్య బందోపాధ్యాయలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. దోషుల్లో ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు ఇండియన్లు ఉన్నారు.

పాకిస్తాన్ కు చెందిన ఎండీ యూనస్, ఎండీ అబ్దుల్లాలు ఇప్పటికే పదేండ్ల శిక్ష పూర్తి చేసుకోగా వాళ్లను తిరిగి పాకిస్తాన్ పంపించాలని కోర్టు ఆదేశించింది. మన దేశానికి చెందిన వారిలో ముజఫర్ విడుదల కానుండగా, నయీంపై మరో కేసుకు సంబంధించి కోర్టులో  హాజరు పరచనున్నారు. కాగా, 2007 ఏప్రిల్ 3న నార్త్ 24 పరగణా జిల్లాలో అక్రమంగా బార్డర్ దాటిన ఈ నలుగురిని సైన్యం లోకల్ పోలీసులకు అప్పగించింది. వీళ్లు దేశంపై యుద్ధం ప్రకటించారని జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి 2017లో, ఒక్కరికి 2018లో ఉరి శిక్ష విధించింది. దీనిపై దోషులు హైకోర్టును ఆశ్రయించగా, ఉరి శిక్షను రద్దు చేసింది.