దక్షిణ కాలిఫోర్నియాలో భీకర తుఫాను.. రాష్ట్రమంతా అతలాకుతలం

దక్షిణ కాలిఫోర్నియాలో భీకర తుఫాను.. రాష్ట్రమంతా అతలాకుతలం
  •     రెండ్రోజుల్లోనే 27.94  సెం.మీ. వర్షం

లాస్ ఏంజిలిస్ : భీకర తుఫానుతో దక్షిణ కాలిఫోర్నియా అతలాకుతలమైంది. ‘పైనాపిల్  ఎక్స్ ప్రెస్’ తుఫాను రెండు రోజుల పాటు రాష్ట్రాన్ని ముంచెత్తింది. రెండు రోజుల్లోనే 27.94 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తాయి. కొండలు, ఎత్తైన ప్రాంతాల నుంచి వరద రావడంతో బురద మేటలు వేసింది. బురదలో వాహనాలు కూరుకుపోయాయి. తుఫాను ప్రభావానికి గంటకు 121 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. 8,75,000 ఇండ్లకు కరెంటు కట్ అయింది. తుఫాను ధాటికి ఇండ్లు, పొలాలు, వాహనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. యూబా సిటీ, సాంటా క్రజ్  పర్వత ప్రాంతాల్లో చెట్లు కూలి ఇద్దరు చనిపోయారు. 

అధికారులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే వరదల కారణంగా ఎమర్జెన్సీ సేవలకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ బురద పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. హాలీవుడ్  హిల్స్  ప్రాంతంలోని మిలియన్  డాలర్ల విలువైన ఇండ్లు భారీ సంఖ్యలో దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో బురద కూడిన వరద పోటెత్తింది. ఎక్కడచూసినా బురద, మట్టి, రాళ్లతో నిండిపోయింది. హాలీవుడ్  హిల్స్, బెవర్లీ హిల్స్  లాంటి ప్రాంతాలు పైనాపిల్  ఎక్స్ ప్రెస్  తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడడంతో ఇండ్లతో పాటు మౌలిక సదుపాయాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. బురదతో కూడిన వరద ఒక అవలాంచీ లాగా దూసుకొచ్చిందని స్థానికుడు ఒకరు తెలిపారు.

ALSO READ:  ఇంధన వనరులు వాటి ఆధారాలు