యాసిడ్​ విక్టిమ్స్​ కోసం క్యాంపెయినింగ్

యాసిడ్​ విక్టిమ్స్​ కోసం క్యాంపెయినింగ్

ఢిల్లీ యువతి లక్ష్మీ అగర్వాల్​ లాంటి కథే ఈ ఇరవైఐదేళ్ల ‘ సంచయిత యాదవ్​’ది. ఇరవై ఏళ్ల వయసులో యాసిడ్​ దాడికి గురైంది. అప్పటి నుంచి ఆమె జీవితం మారిపోయింది. మామూలు మనిషి అవడానికి ఐదేళ్లపైనే పట్టింది. ‘నేనెందుకు బాధపడాలి, నా లాంటి వాళ్లకు ధైర్యాన్ని ఇస్తాను’ అని సంచయిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.  యాసిడ్​ విక్టిమ్స్​ను మోటివేట్​ చేయడానికి దసరా పండుగ నుంచి క్యాంపెయినింగ్​ స్టార్ట్​ చేసింది. చీకటి రోజులను 
ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఇప్పుడు సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న  ఆమె కథే  ఇది..

2015 సెప్టెంబర్​ నెల. 
తల్లితో కలిసి సీత్​బాగ్​ మార్కెట్​కు వెళ్లింది సంచయిత. ఎప్పటిలాగే తల్లితో కబుర్లు చెప్పుకూంటూ నడుస్తోంది. సరుకులు కొని ఇంటికి తిరిగివస్తామనే అనుకుంది. కానీ, నిమిషం టైంలో జరిగిన ఘటన సంచయితను కంప్లీట్​గా మార్చేసింది.  బైక్‌‌‌‌పై వచ్చిన ఒకతను..  తల్లితో వెళ్తున్న ఆమెను ఆపేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సంచయిత ముఖంపై  యాసిడ్‌‌‌‌ పోశాడు. ఊహించని  ఆ దాడి నుంచి సంచయిత తప్పించుకోలేకపోయింది. ముఖం మండిపోతుంటే బిగ్గరగా ఏడుస్తూ కింద కూలిపోయింది. చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.  ట్రీట్మెంట్​ అయితే ఇస్తున్నారు. కానీ, డబ్బులు సరిపోలేదు. తల్లి అక్కడక్కడా అప్పులు చేసింది. డబ్బులు కూడగట్టేందుకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎలాగైతేనేం సంచయిత కోలుకుని ఇంటికి చేరింది. ముఖంనిండా కట్లు, అక్కడక్కడా గాయాలు, ఒళ్లునొప్పులతో ప్రతిరోజూ నరకం అనుభవించేది. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యాక ఆ బాధ నుంచి బయటపడ్డాను అనుకుంది. కానీ ఇంటికి వచ్చాక ఇరుగుపొరుగు వాళ్ల మాటలు శరీరానికైన గాయానికంటే ఎక్కువ బాధ పెట్టాయి. వాటన్నిటిపై గెలవాలని, ఆమెపై దాడి చేసిన వాడికి శిక్షపడాలని పోరాడింది. ఆమె మూడేళ్ల పోరాటానికి ఫలితంగా కోల్​కతా కోర్టు అతనికి శిక్ష వేసింది. అయితే ఇది తనకు దక్కిన సగం న్యాయం మాత్రమే. ‘‘సొసైటీ నుంచి వస్తున్న అవమానాల మీద గెలవాలి. ఇలాంటి దాడుల తరువాత చాలామంది మహిళల జీవితాలు ఆగిపోతున్నాయి. ఇంటినుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉండటం లేదు. వాళ్లకూ ఒక జీవితం ఉంటుంది. వాళ్లూ చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. ఇలాంటి వాటన్నిటిపైనా పోరాడేందుకు నాకు మరింత శక్తి కావాలి. అందుకోసం మానవ హక్కుల సంస్థతో కలసి పనిచేయడం మొదలు పెట్టాను. బాధితులకు న్యాయం చేయాలని. దాడి చేసిన వాళ్లకు శిక్ష పడాలని పోరాడుతున్నాను’’ అని చెప్పింది సంచయిత. కిందటి ఏడాది సంచయిత పెళ్లి చేసుకుంది. ఒక  పాపతో సంతోషంగా ఉందిప్పుడు. అత్తింట్లో ఆమెను గౌరవిస్తారు. పెళ్లి తర్వాత ఆమె పేరు ‘అర్ణ’ గా మార్చారు అత్తింటి వాళ్లు. దాని అర్థం ‘పర్వతమంత శక్తి’. ‘‘ఏడేళ్ల క్రితం నాపై జరిగిన దాడి నన్నెంతో కలచివేసింది. అలాగని బాధపడుతూ కూర్చుంటే నేనిప్పుడు ఆనందంగా ఉండేదాన్ని కాదు. నాలాంటి వాళ్లను ఇన్​స్పైర్ చేయగలిగేదాన్ని కాదు. అందుకే ‘ఐయామ్​ దుర్గ’ క్యాంపెయినింగ్​ స్టార్ట్​ చేశాను’ అంటోంది సంచయిత. కాదు.. కాదు అర్ణ!