బరువు తగ్గే మందు డేంజర్..సెమాగ్లుటైడ్ వాడకంపై డీసీఏ వార్నింగ్

బరువు తగ్గే మందు డేంజర్..సెమాగ్లుటైడ్ వాడకంపై  డీసీఏ వార్నింగ్
  •      సొంతంగా వాడితే కిడ్నీలు, పాంక్రియాస్  దెబ్బతింటాయి
  •     స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తోనే వాడాలని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: బరువు తగ్గడానికి, షుగర్  కంట్రోల్  చేసుకోవడానికి వాడే సెమాగ్లుటైడ్  మందుల విషయంలో  రాష్ట్ర డ్రగ్స్  కంట్రోల్  అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా అలాంటి మందులు వాడితే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం డీసీఏ సర్క్యూలర్ జారీ చేసింది. సెమాగ్లుటైడ్  ఫార్ములేషన్లకు (మల్టీ డోస్  వయల్స్, ప్రీ-ఫిల్డ్  పెన్నులు) ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో డిమాండ్  బాగా పెరిగింది. మార్చి 2026తో ఈ మందుల పేటెంట్ గడువు ముగియడంతో చాలా కంపెనీలు వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటీస్  కోసం జనం వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇవి  ప్రిస్క్రిప్షన్  ఓన్లీ మందులని, వీటిని ఇష్టానుసారంగా వాడకూడదని డీసీఏ డైరెక్టర్ జనరల్  షానవాజ్  ఖాసిం స్పష్టం చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఆ ఇంజెక్షన్లు లేదా మందులు తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దాని వాడకం ద్వారా పాంక్రియాస్  దెబ్బతినే అవకాశం ఉందని, కిడ్నీల పనితీరు మందగించే ప్రమాదం ఉందన్నారు. గాల్ బ్లాడర్  వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని, దానితో పాటు వికారం, వాంతులు వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్  ఉంటాయని వివరించారు. బరువు తగ్గడానికి అడ్డదారులు తొక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.

ప్రజలకు డీసీఏ జారీ చేసిన సూచనలు... 

  • స్పెషలిస్టులే రాయాలి: ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్  మెడిసిన్  స్పెషలిస్టులు రాసిస్తేనే ఆ మందులు వాడాలి. గుండెజబ్బులు ఉన్నవారు కార్డియాలజిస్టుల సలహా తీసుకోవాలి.
  • ఆన్‌‌‌‌ లైన్ లో కొనొద్దు:  సోషల్ మీడియా, గుర్తుతెలియని వెబ్‌‌‌‌ సైట్ల నుంచి వాటిని ఆర్డర్  చేయవద్దు. అవి నకిలీవి లేదా నాణ్యత లేనివి అయ్యే ప్రమాదం ఉంది. లైసెన్స్ ఉన్న మెడికల్  షాపుల్లోనే వాటిని కొనాలి.
  • యాడ్స్ పై  నిషేధం:  ఈ మందులను ప్రచారం చేస్తూ సరోగెట్ అడ్వర్టైజ్మెంట్స్  ఇవ్వడం లేదా పరోక్షంగా ప్రమోట్  చేయడం చట్టరీత్యా నిషేధం.
  • ఫిర్యాదు చేయండి: ఎవరైనా చట్టవిరుద్ధంగా అలాంటి మందులను విక్రయించినా, తప్పుడు ప్రచారం చేసినా వెంటనే డీసీఏ అధికారులకు సమాచారం ఇవ్వాలి.