- వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల సిండికేట్
- గతేడాది సమ్మర్ కంటే మార్కెట్లో 50 శాతం నుంచి 140 శాతం పెరిగిన ధరలు
- నిరుడు వండర్ హాట్ క్వింటాల్ రూ.14 నుంచి 15 వేలు ఈసారి రూ.38 వేలు
- గతంలో తేజ క్వింటాల్ రూ.13 వేలు ఉంటే ఇప్పుడు రూ.20 వేలు
- నాలుగైదు రోజుల్లో క్వింటాల్ పై రూ.5 నుంచి 8 వేలు ధర తగ్గించిన వ్యాపారులు
- జెండాపాటపై మళ్లీ 30 శాతం తగ్గింపు ధరకే కొనేలా కుట్రలు
వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులకు లాభం రానీయకుండా వ్యాపారులు అడ్డుకుంటున్నారు. మార్కెట్లో మిర్చి ధరలు గతేడాదితో పోలిస్తే.. 50 నుంచి 140 శాతం వరకు పెరిగాయి. దీంతో రైతులు తమ పంటను మార్కెట్‍కు తీసుకెళ్తే.. ఎప్పటి మాదిరిగానే అధికారులు, వ్యాపారులు మళ్లీ సిండికేట్‍గా మారి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఉగాది ముందు రోజు ఇచ్చిన ధరలో ఏకంగా క్వింటాల్‍పై రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కోత విధించడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది.
గతేడాది కంటే డబుల్ రేట్లు
వరంగల్ ఏనుమాముల మార్కెట్లో గతేడాది సమ్మర్ సీజన్‍తో పోలీస్తే..ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాది మిర్చికి ధరల్లేక రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్నారు. అవి దొరకని వాళ్లు వ్యాపారులకు ఎంతో కొంతకు అమ్ముకున్నారు. ఈసారి మాత్రం పంటకు రేట్లు పెరిగాయి. 2025 మార్చి చివర్లో క్వింటాల్ తేజ రకం మిర్చి ధర కంటే ఈసారి రూ.6 వేల నుంచి రూ.8 వేల ధర పెరిగింది. వండర్ హాట్ రకానికి రూ.14 వేలు ఉండగా, ఈసారి రూ.38 వేలకు చేరడంతో క్వింటాల్‍పై ఏకంగా రూ.24 వేల ధర పెరిగింది. యూఎస్ 341 రకానికి 100 శాతం ధరలు పెరిగాయి. దేశీ రకానికి సైతం క్వింటాల్‍పై రూ.14 వేల ధర ఎక్కువగా పలుకుతోంది.
ఉగాది సెలవుల్లో ధరలు ఢమాల్
ఏనుమాముల మార్కెట్లో గత సీజన్‍తో పోలిస్తే మిర్చి ధరలు రకానికి అనుగుణంగా కొన్నింటికి 50 శాతం పెరగగా.. వండర్ హాట్ వంటి రకానికి ఏకంగా 150 శాతం వరకు పెరిగాయి. అయితే.. వాతావరణం, పురుగుల బెడద, నల్లి పట్టడం వంటి కారణాలతో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 శాతం మిర్చి దిగుబడి తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పండిన పంటకు పెరిగిన ధరలు కలిసివస్తాయని ఆశతో వస్తున్న రైతులను.. వ్యాపారులు సిండికేట్‍గా మారి మార్కెట్లో వారు చెప్పిన ధరకే పంట అమ్ముకునే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్, 22 ఆదివారంతో మార్కెట్‍కు వరుస సెలవులు వచ్చాయి. కాగా, పండుగ ముందు రోజు వరకు క్వింటాల్ వండర్ హాట్ మిర్చికి గరిష్టంగా రూ.38 వేలు పలకగా.. సెలవుల తర్వాత రూ.32 వేలకు ధర తగ్గించారు. సింగిల్ పట్టీకి రూ.39 వేలు పలకగా..దానిని రూ.34 వేలకు తగ్గించారు. దేశీ మిర్చి రూ.42 వేల నుంచి రూ.40 వేలకు తగ్గింది.
వ్యాపారులు సిండికేట్.. ధరల్లో 30 శాతం కోత
ఏనుమాముల మార్కెట్లో గతేడాది కంటే మిర్చి ధరలు పెరిగాయనే ఆశతో వచ్చిన రైతులకు ఉగాది తర్వాత అధికారులు ఒక్కో క్వింటాల్‍పై రూ.3 వేల నుంచి 8 వేల వరకు ధర తగ్గించడంతో రైతులు నిరాశ చెందారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇది చాలదన్నట్లు.. మార్కెట్ అధికారులు ఉదయం ఒక్కో రకం మిర్చికి ఒక్కో ధర జెండాపాటలో నిర్ణయించి వెళ్లాక.. వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. లోలోపల మార్కెట్ ధర కంటే 25 నుంచి 30 శాతం తగ్గించి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయకుండా దళారులు దందా నడిపిస్తున్నారు. ఉదాహరణకు.. నాణ్యత ఆధారంగా క్వింటాల్ రూ.30 వేల నుంచి రూ.32 వేల జెండాపాట ధర ఉండే వండర్ హాట్ రకానికి రూ.20 వేల నుంచి రూ.22 వేలు మాత్రమే కట్టిస్తున్నారు. దీంతో పెరిగిన మిర్చి లాభాలు రైతులకు దక్కకుండా వ్యాపారులు తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారు.
కళ్ల ముందే సిండికేట్ అవుతున్రు
ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులదే హవా నడుస్తోంది. ప్రభుత్వం, కలెక్టర్ వంటి పెద్దాఫీసర్లు ఎన్ని చెప్పినా.. అధికారులు, వ్యాపారులు కలిసే రైతులతో బిజినెస్ చేస్తున్నారు. ఓ వ్యాపారి వచ్చి అధికారులు చెప్పిన ధర కంటే రూ.6 నుంచి 7 వేలు తగ్గించి ధర చెబితే మరో వ్యాపారి మా పంట దగ్గరకు రావట్లేదు. వచ్చినా మొదటి వ్యాపారి చెప్పిన అగ్గువ ధరనే చెబుతుండు. ఎటొచ్చి రైతును మోసం చేస్తున్రు.
– ఎం.రామనాధం, భూపాలపల్లి రూరల్
లాభం అంతా వ్యాపారులకే..
ఉగాది తర్వాత క్వింటాల్‍పై రూ.6 వేలు ఎట్ల తగ్గిస్తరు. వండర్ హాట్ ధర పండుగ ముందు రూ.38 వేలు ఉండగా, సెలవుల తరువాత రూ.32 వేలు అంటున్నరు. గతేడాది పెట్టిన పెట్టుబడే ఈసారి పెట్టినం. కానీ, దిగుబడి అప్పటంత రాలే. పెరిగిన ధరతో నష్టం తగ్గుతుందనుకుంటే.. ఏమేమో కారణాలు చెప్పి పెరిగిన మిర్చి లాభాలను వ్యాపారులే తీసుకుంటున్నారు.
– ఎస్.శ్రీనివాసరాజు, భూపాలపల్లి
