- ఆఫీసులు వదిలే వేళ వడగండ్ల వాన
- ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో బీభత్సం
- ఐటీ కారిడార్‌లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
- విరిగిపడ్డ 14 చెట్లు, విద్యుత్ స్తంభాలు, పలుచోట్ల కరెంట్‌కట్
హైదరాబాద్ సిటీ/మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని అనుకోని వాన ఆగం చేసింది. సాయంత్రం ఆఫీసులు వదిలే వేళ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల వడగండ్ల వాన, మరికొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో దంచికొట్టింది. దీంతో ఐటీ కారిడార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో మొత్తం 14 చెట్లు విరిగిపడగా, కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇలా మొదలైంది
సీఎంసీ, జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం సాయంత్రం 6–30 గంటలకు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నా సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం దంచికొట్టింది. షేక్ పేట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బాలానగర్, గోల్కొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా రెండుగంటల్లో షేక్ పేట్ లో 5.13 సెంటిమీటర్లు పడింది. రెండు గంటల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి వరద చేరింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో ఉద్యోగులు ఎక్కడికక్కడ వానలో చిక్కుకుపోయారు. మరోవైపు రోడ్ల మీదకు వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం తగ్గిన తర్వాత ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో హైటెక్ సిటీలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈదురుగాలులకు ఐటీ కారిడార్ లో 14 చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి-–డీఎల్ ఎఫ్ రూట్లో రోడ్డు డివైడర్‌పై చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం పడటంతో అక్కడ కొద్దిసేపు రోడ్డు క్లోజ్ చేశారు. సమాచారం అందుకున్న హైడ్రా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డీఆర్ఎఫ్) బృందాలు చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు.
బంజారాహిల్స్‌లోనూ..
బంజారాహిల్స్‌తో పాటు కృష్ణానగర్లోనూ వర్షం దంచికొట్టింది. రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్స్తంభించింది. కృష్ణానగర్‌లో సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల టూ వీలర్లు కొట్టుకుపోయాయి. రోడ్లపై నీళ్లు నిండిపోవడంతో నడవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో కొందరు మెట్రో పిల్లర్లను పట్టుకుని ముందుకుసాగారు. వర్షం తగ్గాక సెల్లార్లలోని నీటిని బయటకు తోడుకోవాల్సి వచ్చింది. దీంతో నీళ్లు పోయి బురద మిగిలింది. బస్టాపుల్లో కూడా నీరు నిలవడంతో బస్సెక్కడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
విరిగిపడ్డ చెట్లు....
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ఈదురు గాలులకు14 చెట్లు విరిగిపడ్డాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. 45 నిమిషాల వ్యవధిలోనే వాన భీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, కొండాపూర్, యూసుఫ్ గూడ, హఫీజ్ పేట్, మియాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. తక్కువ వర్షం నమోదైనప్పటికీ, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడటంతో ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందని తెలిపారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. గచ్చిబౌలి-–డీఎల్ ఎఫ్ మార్గంలో రోడ్డు డివైడర్‌పై చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం కూడా విరిగిపడడంతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.
ప్రాంతం వర్షపాతం (సెం.మీ)
రాత్రి 9గంటల వరకు
షేక్ పేట్ 5.13
జూబ్లీహిల్స్ 4.73
లంగర్ హౌస్ 3.75
గచ్చిబౌలి 3.68
మియాపూర్ 3.33
మూసాపేట్ 2.68
మాదాపూర్ 2.68
బాలానగర్ 2.65
కేపీహెచ్ బీ 2.38
రాజేంద్రనగర్ 2.30
