బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పిస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి

బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పిస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మంచిర్యాల జిల్లాలో వర్ష ప్రభావ ప్రాంతాల్లో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పర్యటన
  • మందమర్రిలో భారీ వర్షంతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని హామీ 
  • ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న: వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: రెండు రోజుల క్రితం భారీగా కురిసిన వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈదురుగాలులు, భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్న దీపక్ నగర్, పాలచెట్టు ప్రాంతాల్లో ధ్వంసమైన ఇండ్లు, స్కూల్‌‌‌‌ను పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జరిగిన నష్టంపై తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు.

ఆ తర్వాత ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యతో కలిసి కళాకారులను సన్మానించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, వారి త్యాగాలు, కృషి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

అంతకుముందు హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో, మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్‌‌‌‌లో యువత, క్రీడాకారులు, చిన్నారులతో కలిసి బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడారు. గ్రౌండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరగా, వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎంపీ చెప్పారు. అనంతరం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో రత్నలాల్ హోటల్ వద్ద స్థానికులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాగా, తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కారించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం ఉద్యోగులు మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. సమస్యలను సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

మునీర్‌‌ రాసిన పుస్తకం ఆవిష్కరణ 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ మునీర్ కీలక పాత్ర పోషించారని, సింగరేణి జేఏసీ చైర్మన్‌‌‌‌గా కార్మిక లోకాన్ని ఏకం చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి సీఈఆర్ క్లబ్‌‌‌‌లో దివంగత ఎండీ మునీర్ రాసిన పుస్తకాన్ని మంత్రి వివేక్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తారని తెలిపారు.

ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న ఎండీ మునీర్.. సింగరేణి కోల్‌‌‌‌బెల్ట్ ప్రాంతంలో భూస్వాములకు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి కాలం నుంచి తమ కుటుంబానికి మునీర్‌‌‌‌‌‌‌‌తో మంచి అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. మందమర్రిలో మునీర్ విగ్రహం, స్మారక భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆంధ్ర పెద్దలు హైదరాబాద్‌‌‌‌లోనే ఉంటూ ఇక్కడ తమను రానీయడం లేదంటూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌‌‌‌లో ప్రెస్ మీట్‌‌‌‌లు పెట్టుకుంటూ తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.