
ఒట్టావా : అంతర్జాతీయ స్టూడెంట్ వీసాలపై కెనడా రెండేండ్ల ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హౌసింగ్ సంక్షోభాన్ని, ఇతర సంస్థాగత సవాళ్లను కట్టడి చేయడంలో భాగంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది దాదాపు 5.6 లక్షల వీసాలు జారీ అయితే, ఈ ఏడాది అవి 3.64 లక్షలకు పరిమితమయ్యే అవకాశం ఉంది.
కెనడాలో ఇండ్ల కొరత తీవ్రంగా ఉన్నది. ఇలాంటి సమయంలో కెనడాలోకి ప్రవేశించే ఇతర దేశాల వారితో ఆయా ప్రావిన్సుల నుంచి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే వీసాలపై రెండేండ్ల క్యాపింగ్ ఆంక్షలు విధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో మిగతా దేశాలతో పోలిస్తే.. భారత్‌నుంచి ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.