క్యాన్సర్ పేషెంట్లకు నరకం చూపే ఆ టెస్టు అవసరం లేదు.. ఇక నుంచి బ్లడ్ టెస్టుతోనే నిర్ధారణ.. త్వరలో నిమ్స్లో అందుబాటులోకి

క్యాన్సర్ పేషెంట్లకు నరకం చూపే ఆ టెస్టు అవసరం లేదు.. ఇక నుంచి బ్లడ్ టెస్టుతోనే నిర్ధారణ.. త్వరలో నిమ్స్లో అందుబాటులోకి

 

  • -ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రాగానే లిక్విడ్ ​బయాప్సీ ప్రారంభం
  • పేషెంట్లకు బాధ కలిగించే, ఆర్థికంగా భారమయ్యే టిష్యూ బయాప్పీ అవసరం ఉండదు

హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ చికిత్సలో నిజామ్స్​ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) క్యాన్సర్​కు సంబంధించి త్వరలో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. క్యాన్సర్ పేషెంట్లకు ఎంతో భారంగా, బాధాకరంగా మారే టిష్యూ బయాప్సీ(శరీర భాగం నుంచి ముక్క తీసి చేసే పరీక్ష) అవసరం లేకుండానే.. చిన్న రక్త పరీక్షతో వ్యాధిని గుర్తించే లిక్విడ్ బయాప్సీని ప్రారంభించనున్నారు.

 ఇప్పటికే ఈ హాస్పిటల్​ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్యాన్సర్ జెనోమిక్స్ సెంటర్ ద్వారా ఖరీదైన మాలిక్యులర్ టెస్టులను ఫ్రీగా చేస్తోంది. లిక్విడ్ బయాప్సీ ద్వారా శరీరంలో క్యాన్సర్ కణాలు ఎలా పెరుగుతున్నాయి? మనం వాడే మందులు ఎంతవరకు పని చేస్తున్నాయి? వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉందా? అనే కీలక అంశాలను ప్రాథమిక దశలోనే అత్యంత కచ్చితత్వంతో తెలుసుకోవని డాక్టర్లు చెబుతున్నారు. ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రాగానే పేషెంట్లకు సేవలందిస్తామని తెలిపారు.

  • మూడు రాష్ట్రాల పేషెంట్లకు నిమ్స్ ఒక్కటే దిక్కు

డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్(డీహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా చేపట్టిన డైమండ్స్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 25 సెంటర్లను ఎంపిక చేశారు. వీటిలో నిమ్స్ ఒకటి. సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్​లో ఎన్జీఎస్, డిజిటల్ డ్రాప్లెట్ పీసీఆర్, ఫిష్ , ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ వంటి మాలిక్యులర్ టెస్టులు చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చవుతుంది. నిమ్స్ లోని జెనోమిక్స్ సెంటర్ ద్వారా ఈ పరీక్షలన్నీ పూర్తి ఉచితంగా చేస్తున్నారు.

 2024లో ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1,443 మంది క్యాన్సర్ బాధితులు లబ్ధి పొందారు. వీరిలో 784 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లు, 659 మంది రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్న మహిళలు ఉన్నట్లు నిమ్స్ అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల క్యాన్సర్ పేషంట్లకు నిమ్స్ ఒక్కటే దిక్కుగా నిలుస్తోంది.

  • టార్గెటెడ్ థెరపీతో క్యాన్సర్​కు చెక్

జెనెటిక్ టెస్టుల వల్ల ఏ క్యాన్సర్ పేషంట్ కు ఏ రకమైన మందు వాడితే క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా తుదముట్టించవచ్చో ముందే తెలుస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో టార్గెటెడ్ థెరపీ అంటారు. దీనివల్ల అనవసరమైన చికిత్సల ఖర్చు తగ్గడమే కాకుండా.. తక్కువ సమయంలోనే వ్యాధి నయమై రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.బీరప్ప, పాథాలజీ  డిపార్ట్​మెంట్ హెడ్ డాక్టర్ శంతవీర్ జి.ఉప్పిన్ తెలిపారు.