చచ్చిపోతం.. పర్మిషన్ ఇవ్వండి

చచ్చిపోతం.. పర్మిషన్ ఇవ్వండి
  • కోర్టు కేసుల్లో మూడున్నరేండ్లుగావివరణ ఇవ్వడం లేదు
  • టీఎస్‌ఎల్‌ పీఆర్‌ బీ అన్యాయం చేసింది

హైదరాబాద్‌‌, వెలుగు: సామూహిక మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కానిస్టేబుల్‌‌ అభ్యర్థులు హెచ్‌‌ఆర్‌‌‌‌సీని ఆశ్రయించారు. పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డ్‌‌(టీఎస్​ఎల్​పీఆర్​బీ) 2015 నోటిఫికేషన్‌‌ కానిస్టేబుల్స్‌‌ నియామకాల్లో జరిగిన అవతవకలతో నష్టపోయామని 20 మంది బాధిత అభ్యర్థులు సోమవారం హెచ్‌‌ఆర్‌‌‌‌సీలో పిటిషన్‌‌ ఫైల్‌‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో మూడున్నరేండ్లుగా తీవ్ర మానసికవేదనకు గురవుతున్నామని తెలిపారు.

హైకోర్టులో 24 పిటిషన్లు పెండింగ్‌‌

సెలెక్షన్స్‌‌లో తాము అన్ని అర్హతలు సాధించినా టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ చేసిన తప్పుల వల్ల డిస్‌‌క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైజంప్‌‌తో పాటు వివిధ రకాల ఈవెంట్స్‌‌లో జరిగిన అవతవకల కారణంగా సుమారు 108 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అందులో పేర్కొన్నారు. దీంతో బాధితులు హైకోర్టులో 24 పిటిషన్లు ఫైల్‌‌చేశారని హెచ్‌‌ఆర్‌‌‌‌సీకి తెలిపారు. పిటిషన్ల హియరింగ్‌‌లో పోలీస్‌‌రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు వివరణ ఇవ్వడం లేదని ఆరోపించారు. కోర్టుకు సరైన వివరణ ఇవ్వకుండా గత మూడున్నరేండ్లుగా వాయిదాలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరు వల్ల తీవ్రంగా నష్టపోయిన నల్లగొండ జిల్లా మేములపల్లి మండలం రామవారిగుడెం గ్రామానికి చెందిన వనపట్ల మధు(29) అనే అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నట్లు హక్కుల కమిషన్‌‌కు వివరించారు. సాయంత్రం పిటిషన్​ విచారించిన హెచ్‌‌ఆర్‌‌‌‌సీ కమిషన్‌‌ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా అభ్యర్థులకు సూచించింది.

సర్కార్ తప్పుకు మేం బలయ్యాం

“అన్ని ఎగ్జామ్స్‌‌తో పాటు ఫిజికల్‌‌ టెస్ట్‌‌లో మేము అర్హత సాధించాము. ఈవెంట్స్‌‌లో అవకతవకలు జరిగాయి. ఏపీ అభ్యర్థులను సెలెక్ట్‌‌ చేశారు. హైజంప్‌‌ ఈవెంట్స్‌‌లో జిల్లాల వారిగా తేడాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, సైబరాబాద్‌‌ కమిషనరేట్స్‌‌కు కలిపి ఒకే కటాఫ్‌‌ పెట్టారు. మాకు ఎన్‌‌సీసీ ఉన్నా రిజర్వేషన్‌‌ ఇవ్వలేదు. హైకోర్టులో కేసుల హియరింగ్‌‌కి అధికారులు సహకరిస్తలేరు. ప్రతి హియరింగ్‌‌కి వివరణ ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారు.’’

– ఎం. సంతోశ్, బాధితుడ