టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పీడ్ పెంచిన అభ్యర్థులు 

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పీడ్ పెంచిన అభ్యర్థులు 

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ప్రచారానికి వారం రోజులే గడువు ఉండడంతో, ఓటర్లను కలిసేందుకు పోటీ పడుతున్నారు. సర్కారు విద్యా సంస్థల్లోని సమస్యలు, టీచర్ల సమస్యలే ప్రధాన ఏజెండాగా ముందుకు పోతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్‌‌‌‌కు రెండ్రోజుల ముందే ప్రచారంపై నిషేధం ఉంటుంది. దీంతో సెగ్మెంట్ పరిధిలోని 9 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో అభ్యర్థులు విస్తృతంగా తిరుగుతున్నారు. సెగ్మెంట్‌‌‌‌లో 29 వేల ఓటర్లున్నారు. వీరిలో సగానికి పైగా సర్కారు స్కూళ్లకు చెందిన టీచర్లే ఉన్నారు. దీంతో అభ్యర్థులంతా వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. బరిలో 21 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా చెన్నకేశవరెడ్డి, మాణిక్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, భుజంగరావు, విజయకుమార్, వినయకుమార్, హర్షవర్ధన్ రెడ్డి తదితరుల మధ్యనే పోటీ ఉన్నట్టు టీచర్లు చెప్తున్నారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని జనార్దన్ రెడ్డి చూస్తున్నారు.

సర్కారు విద్యా వ్యతిరేక విధానాలే ఎజెండా..

సర్కారు విద్యా వ్యతిరేక విధానాలనే ఎజెండాగా టీచర్ ఎమ్మెల్సీలు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా జీవో 317 బాధితులు సమస్యలపై సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో పాటు పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని నిలదీస్తున్నారు. అయితే, గెలిపిస్తే సొంత జిల్లాకు పంపించేలా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఒప్పిస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. లాంగ్వేజీ పండిట్లు, పీఈటీల అప్‌‌‌‌గ్రేడ్, సీపీఎస్ అంశం, జీతాలు సకాలంలో రాకపోవడం, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, మెడికల్, జీపీఎఫ్, లోన్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉండటంపైనే అభ్యర్థులు ఎక్కువగా మాట్లాడుతున్నారు.