జేబీఎస్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, రసూల్‌పురా వై-జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్‌కు అదనపు భూముల కేటాయింపు, జూబ్లీ బస్టేషన్ వద్ద తొలగించిన షాపుల పునఃకేటాయింపు, ఆస్తిపన్ను పెంపు అంశాలపై చర్చ జరిగింది.
రసూల్‌పురా వై-జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ రూ.150 కోట్లతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌కు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ ఆర్వింద్ కుమార్ ద్వివేది తెలిపారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్–బేగంపేట్, మినిస్టర్ రోడ్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అన్నారు.
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం మరో రెండు ఎకరాల భూమి కేటాయింపునకు రక్షణ శాఖ అంగీకరించిందని, ఇందుకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు చెల్లించనుందని పేర్కొన్నారు. ఇప్పటికే 25 ఎకరాలకు రూ.303 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు.
కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసిందని నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. జూబ్లీ బస్టేషన్ వద్ద తొలగించిన షాపుల స్థానంలో వాణిజ్య సముదాయం నిర్మించి వేలంపాట ద్వారా కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆస్తిపన్ను పెంపులో జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ సూచించారు.
