ఇబ్రహీంపట్నం, వెలుగు: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. స్థానికులు అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న ఐదుగురిని కాపాడిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్కు చెందిన ఐదుగురు శనివారం కారులో హైదరాబాద్వెళ్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఓఆర్ఆర్ సమీపానికి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనాన్ని ఆపడంతో స్థానికులు వచ్చి, అద్దాలు పగులగొట్టి లోపలున్నవారిని బయటకు లాగారు. ట్యాంకర్ నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
