జూబ్లీహిల్స్ , వెలుగు: షేక్‌పేట ఓయూ కాలనీలో దారుణం జరిగింది. సరిగా చదవడం లేదని 7 ఏండ్ల బాలుడికి ట్యూషన్ టీచర్ అట్లకాడతో వాతలు పెట్టింది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్ పేట ఓయూ కాలనీకి చెందిన వెంకటరమణకు ఇద్దరు కొడుకులు వెంకటేశ్ (13), తేజా నందన్ (7) ఉండగా, మూడు నెలలుగా సమీపంలోని టీచర్ మానస వద్దకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు.
ఎప్పటిలాగే గురువారం ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ట్యూషన్ టీచర్ కు ఫోన్ చేయగా, మీరే వచ్చి తీసుకువెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. అప్పటికే తేజ గాయాలతో విలపిస్తుండగా, ఏమైందని అడగగా టీచర్ తన ముఖం, కాళ్లు, చేతులపై అట్లకాడతో కాల్చి వాతలు పెట్టిందన్నాడు. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

