భార్యకు తెలియకుండా ఆమె అకౌంట్ నుంచి రూ.కోటి డ్రా

 భార్యకు తెలియకుండా ఆమె అకౌంట్ నుంచి రూ.కోటి డ్రా

బయి: బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా  వ్యవహారంపై స్వయంగా ఆయన భార్య నిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి తనపై దాడి చేసి కొట్టినట్లు ఫిర్యాదు చేసి జైలుకు పంపిన ఆమె నెల రోజులు గడవక ముందే మరోసారి పోలీసుల తలుపు తట్టింది. అయితే ఈసారి ఏకంగా కోటి రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి తనకు తెలియకుండా డ్రా చేసుకున్నాడన్నది ఫిర్యాదు. అంతేకాదు ఈసారి భర్తతోపాటు ఆయన మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు చేసింది.

కరణ్ మెహ్రా ఎనిమిదేళ్ల క్రితం నిషితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ తరచూ కలహించుకుంటూ రచ్చకెక్కుతున్నారు. గత మే 31వ తేదీ రాత్రి ముంబయిలోని గోరెగావ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి తనపై తీవ్రంగా దాడి చేసి హింసించాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసే వరకు పోలీసు స్టేషన్ నుంచి కదల్లేదు. దీంతో భార్యాభర్తల వివాదంపై చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు చివరకు కరణ్ మెహ్రాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో బెయిల్ పై ఇంటికి వచ్చిన కరణ్ మెహ్రా తిరిగి భార్యతో గొడవపడినట్లు సమాచారం. మొన్న శుక్రవారం రాత్రి నిషి పోలీసు స్టేషన్ కు వెళ్లి తనకు తెలియకుండా తన బ్యాంకు అకౌంట్ నుంచ రూ.కోటి డ్రా చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని పట్టుపడింది.

తన భార్య ప్రవర్తనపై కరణ్ మెహ్రా పెదవి విప్పారు. ఆమెకు కోపం వస్తే విచక్షణ కోల్పోతుందని.. ఇంట్లో వస్తువులు పగులగొట్టి బీభత్సం సృష్టిస్తే తప్ప శాంతించదని వాపోయాడు. ఆమె గురించి బయటకు చెప్పుకుంటే తన పరువే పోతుందని ఇంత వరకు మౌనం దాల్చానని.. ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందామని కూడా ఒక్కోసారి ఆలోచనలు వస్తుంటాయని కరణ్ మెహ్రా చెప్పాడు. వీరి కుటుంబ వ్యవహారంపై హిందీ టీవీ పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. బంధాన్ని నిలుపుకోవాలనుకునే ఆశలు.. కోరికలు ఉంటే ఏమైనా సాయం చేయొచ్చని.. దేనికైనా రెడీ అన్నట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఏం చేయగలమని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. వీరి కలహాల కాపురం గురించి పట్టించుకునే తీరిక బయటి వాళ్లెవరికీ ఆసక్తి చూపడంలేదని అంటున్నారు.