జానయ్య పై మరో రెండు కేసులు

జానయ్య పై మరో రెండు కేసులు
  •  అనుచరులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు 

సూర్యాపేట, వెలుగు : నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై కేసులు ఆగడం లేదు. తనపై  పోలీసులు ఏకంగా12 కేసులు నమోదు చేయడాన్ని సవాల్​ చేస్తూ జానయ్య సుప్రీం కోర్ట్ కు వెళ్లగా, బెయిల్​ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను కేసుల పేరుతో  వేధిస్తున్నారని జానయ్య కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా  పోలీసులు మరో రెండు కేసులు పెట్టారు.  వాట్సాప్ గ్రూప్ లో మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా జానయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు పోస్టులు పెడ్తున్నారని సుధాకర్​ అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ పీఎస్​లో జానయ్య , ఆయన అనుచరులపై  కేసు నమోదు చేశారు.  గాంధీనగర్​ ల్యాండ్​ ఇష్యూలో జానయ్య, ఆయన కుటుంబసభ్యులు తనను ఫోన్​ లో బెదిరిస్తున్నారంటూ రామస్వామి శైలజ ఫిర్యాదుతో జానయ్యతో పాటు ఆయన కొడుకు, అక్క, అల్లుడిపైనా మరో కేసు నమోదు చేశారు. ఇటీవల బీఆర్ఎస్​ నుంచి బయటకు వచ్చిన జానయ్య వర్గం బీఎస్పీలో చేరింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్, జానయ్యకు సూర్యాపేట నుంచి బీఎస్పీ టికెట్​ ప్రకటించారు.

సూర్యాపేటలో బీఎస్పీ ఆఫీసు ప్రారంభానికి ప్రవీణ్​కుమార్ ​రావడంతో ఆ సందర్భంగా తీసిన ర్యాలీలో 10వేల మందికిపైగా పాల్గొనడం బీఆర్​ఎస్​ వర్గాల్లో కలకలం రేపింది. దీన్ని జీర్ణించుకోలేకే జానయ్యపై మరోసారి కేసులు పెడ్తున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.  ఇటీవల జానయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టేందుకు యత్నించగా, పలువురిని అరెస్ట్ చేసి రెండు రోజుల తర్వాత రిలీజ్​ చేశారు. జానయ్య ముఖ్య అనుచరుడిగా పేరున్న ఒకరిని ఇటీవలే పీఎస్​కు పిలిపించి జానయ్యకు మద్దతిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.