- హెచ్ సీఏ కోచ్ లతో వారికి శిక్షణ ఇప్పిస్తాం
- మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ
- ప్రతాపసింగారంలో క్రికెట్ స్టేడియం ప్రారంభించిన మంత్రి
ఘట్‌కేసర్, వెలుగు: ఆటలతో ఆరోగ్యానికి మేలు అని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని ప్రతాపసింగారంలో నిర్మించిన 'స్పాట్‌లైట్ అకాడమీ' అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియంను వివేక్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అమర్‌నాథ్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వివేక్ మాట్లాడారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అపార ప్రతిభ ఉన్నా సరైన మౌలిక వసతులు లేక ఎంతో మంది యువత వెనుకబడుతున్నారని, అలాంటి యువతకు ఈ స్టేడియం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.
ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ అకాడమీ నిర్వాహకులు అత్యాధునిక వసతులతో స్టేడియం నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ‘‘పిల్లలు, యువతకు క్రికెట్‌పై ఇంట్రెస్ట్ ఉన్నా.. సరైన గ్రౌండ్లు, శిక్షణ లేక అవకాశాలు కోల్పోతున్నారు.
ఈ తరహా క్రీడా ప్రాంగణాలు ఏర్పడితే యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తాం. అవసరమైతే హెచ్ సీఏ నుంచి అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తాం” అని వివేక్ పేర్కొన్నారు.
హెచ్ సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. నగర పరిసర ప్రాంతాల్లో మరిన్ని క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు.
టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని యువతకు ఆయన సూచించారు. మొయినాబాద్ ప్రాంతంలో తాను ఏర్పాటు చేసిన క్రికెట్ గ్రౌండ్‌కు విశేష స్పందన లభిస్తున్నదని, ఇక్కడ కూడా మంచి కోచ్‌లు అందుబాటులో ఉండడం గ్రామీణ యువతకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
